దౌత్యానికి మోడీ కొత్త భాష్యం | narendra modi gives new definition for diplomacy | Sakshi
Sakshi News home page

దౌత్యానికి మోడీ కొత్త భాష్యం

Published Fri, Aug 22 2014 1:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

దౌత్యానికి మోడీ కొత్త భాష్యం - Sakshi

దౌత్యానికి మోడీ కొత్త భాష్యం

మన ప్రధాని భారత్‌కు తిరిగివచ్చిన వెంటనే భూటాన్ విదేశీ వ్యవహారాల శాఖ చైనా దిమ్మతిరిగే ప్రకటన చేసింది. భూటాన్‌లో ఎప్పటికీ చైనా దౌత్య కార్యాలయాన్ని అనుమతించబోమన్నది ఆ ప్రకటన సారాంశం.
 
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. మన జనాభా 125 కోట్లు. మనలో 5వ వంతు కూడా లేని పాకిస్థాన్‌కు మనల్ని అస్థిరపరచే సాహసం ఎలా వచ్చింది? 30 ఏళ్ల క్రితం సమస్యలతో కునారిల్లిన చైనా సూపర్ పవర్ ఎలా కాగలిగింది?  చైనా ముద్దుగా పిలుచుకునే ‘ముత్యాల హారం’ (పాకిస్థాన్, నేపాల్, బంగ్లా, శ్రీలంక) దేశాలను వేలకోట్ల పెట్టుబడు లతో ముంచెత్తిస్తోంది. ఇవన్నీ కాంగ్రెస్/యూపీఏ  పాలన దుష్ఫలితాలే. ఇలా చతికిలపడిన భారత్ దౌత్య వ్యవహారాలను గాడిన పెట్టే బృహత్ కార్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ భుజాలకెత్తుకున్నారు.
 
బెదిరింపులకు లొంగని ప్రధాని
దేశ ప్రయోజనాల కోసం బెదిరింపులకు, హూంకరింపులకు తలొ గ్గేదిలేదని ప్రమాణస్వీకారం రోజే మోడీ రుజువు చేశారు. సార్క్ దేశాల ప్రతినిధుల సమక్షంలో తాను బాధ్యతలు స్వీకరించాలని అనుకున్నదే తడవుగా ఆయన పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను పిలవ టానికి వీలులేదని ఎప్పటిలాగే తమిళ పార్టీలు హెచ్చరించాయి. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ లాగే మోడీ బెదిరి, ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆ పార్టీలు భావించి ఉండవచ్చు. కిందటి నవంబర్‌లో కొలంబోలో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్(చోగమ్) సదస్సు జరిగింది.
 
దీనికి మన్మోహన్ హాజరు కావలసి ఉంది. కానీ యూపీఏ భాగస్వామి డీఎంకే, ఇతర పార్టీలు ప్రతిఘటించాయి. ఎల్‌టీటీఈపై జరిగిన యుద్ధంలో వేలాది మంది తమిళులను ఊచకోత కోసిన శ్రీలంకకు భారత ప్రధాని ఎలా వెళతారన్నది వారి ప్రశ్న.  ఆ బెదిరింపులకు మన్మోహన్ తలొగ్గి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను పంపించి తన ప్రభుత్వం కూలిపో కుండా కాపాడుకున్నారు. ఇలాంటి బెదిరింపులే వచ్చినా మోడీ ఏంచేశారో  తెలుసు.
 
మహీంద రాజపక్స వచ్చి వెళ్లారు.  తమిళ పార్టీల బెదిరింపులకు లొంగి యూపీఏ శ్రీలంకతో దౌత్య సంబంధాలను గాలికి ఒదిలేయటం చైనాకు అనుకూలించింది. ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఖర్చుతో హంబన్ తోట ఓడరేవును మెగాపోర్టుగా నిర్మించే బాధ్యతను చైనా తీసుకుంది. 900 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, కొలంబో - కతునాయకే ఎక్స్‌ప్రెస్‌వే, 322 కిలోమీటర్ల క్యాండీ - జాఫ్నా ఎ-9 జాతీయ రహదారి, ఇంకా పదుల సంఖ్యలో భారీ ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం కూడా మన పారిశ్రామికవేత్తలను పంపించి గృహనిర్మాణం, రహదారులు, థర్మల్ విద్యుత్  వంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చు కున్నా చైనాతో పోలిస్తే ఇవి 10 శాతం కూడా లేవు. మోడీ హయాంలో ఈ లోటు తీరడమే కాక చైనా ప్రాబల్యం తగ్గించేందుకు శ్రీలంక యోచిస్తుందని భావించవచ్చు.
 
తీస్తా నదీ జలాల వివాదం, భారత్‌లోకి అక్రమ చొరబాట్ల గురించి బంగ్లాదేశ్‌తో విభేదాలు ఉన్నాయి.  ఈ సమస్యల పరిష్కారానికి  యూపీఏ ప్రయత్నించలేదు. దీనిని అవకాశంగా తీసుకొని చైనా బంగ్లాకు సహాయాన్ని అందిస్తూ వస్తోంది. సేతీ నదిపై 750 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రానికి చైనా 1.6 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెడుతోంది. బంగ్లాపై చైనాకు ఇంత ప్రేమ ఎందుకు? అక్కడ ఉన్న 60 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజవాయువు నిక్షేపాలు ఒక కారణం. గ్యాస్‌ని వెలికితీసే పరిజ్ఞానం బంగ్లాకు లేకపోవ టంతో ఆ అవకాశాన్ని వాడుకొని తమ దేశానికి తరలించుకుపోవాలని చైనా ఆలోచన. బంగ్లాను తమవైపు తిప్పుకోగలిగితే పాకిస్థాన్‌లాగే ఈ దేశాన్ని కూడా భారత్‌కు పక్కలో బల్లెంలా మార్చవచ్చన్నది చైనా దురాలోచన.
 
బ్రిక్స్ సదస్సులో అరుదైన గౌరవం
‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోడీ వ్యక్తిత్వాన్ని సభ్య దేశాలు గుర్తించాయి. ప్రపంచ బ్యాంకు తరహాలో ఏర్పాటు చేయబోయే కొత్త ఆర్థిక వ్యవస్థకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అని మోడీ సూచించిన పేరును ఖరారు చేశాయి. ఈ బ్యాంకు కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ఆయన పట్టుపట్టారు. కానీ ఇందులో చైనా వాటాధనం ఎక్కువగా ఉండటంతో చివరకు షాంఘై పేరు ఖరారైంది. అయితే కొత్త బ్యాంకుకు ఆరేళ్లపాటు అధ్యక్షత వహించే అవకాశం భారత్ దక్కించుకుంది.
 
మోడీ భూటాన్ యాత్ర ఘనవిజయమే. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌కు - భారత్‌కు మధ్యన ఉన్న ఈ హిమాలయ దేశం మొదటినుంచి భారత్‌తోనే సంబంధాలు కొనసాగిస్తోంది. గతంలో మన నేతలు సందర్శిం చిన సందర్భాల్లో మొక్కుబడి ఒప్పందాలు, ఆర్థిక సహాయం ప్రకటనలు ఉండేవి. మోడీ పర్యటన దూరంగా ఉన్న బంధువులను కలుసుకునేందుకు ఒక కుటుంబ ముఖ్యుడు వెళ్లినట్లుగా ఉందే తప్ప దౌత్య పర్యటన లాగా అనిపించలేదు. ప్రపంచపటంలో రేఖా మాత్రంగా ఉన్నప్పటికీ భూటాన్‌కు భారత్‌లోని అతిపెద్ద సమస్యను పరిష్కరించే శక్తి ఉంది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం భూటాన్‌లోని వందలాది నదులపై జలవిద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే 30,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
 
ఇందులో 10,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాలను 2020 వరకు నిర్మించటానికి భారత్‌తో ఒప్పందాలు జరిగాయి. నిధుల విడుదల సవ్యంగా జరగకపోవటంతో ఈ ప్రాజెక్టులు గడువులోగా పూర్తికావటం అనుమానమే. వాస్తవానికి భారత్ ఎప్పుడో మేల్కొని ఈ జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణం లేదా సహాయం అందించి ఉంటే ఈపాటికే కనీసం 20,000 మెగావాట్లు అందుబాటులోకి వచ్చేవి. థింపూలో భారత్ సహాయంతో నిర్మించిన సుప్రీం కోర్టు భవనాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు. 600 మెగావాట్ల కొలోంగ్‌చు జలవిద్యుత్ కేంద్రాన్ని ఉమ్మడిగా చేపట్టటానికి ఒప్పందం కుదిరింది. మన ప్రధాని భారత్‌కు తిరిగివచ్చిన వెంటనే భూటాన్ విదేశీ వ్యవహారాల శాఖ చైనా దిమ్మతిరిగే ప్రకటన చేసింది. భూటాన్‌లో ఎప్పటికీ చైనా దౌత్య కార్యాలయాన్ని అనుమతించబోమన్నది ఆ ప్రకటన సారాంశం.
 
నేపాల్‌లో పెరిగిన ప్రతిష్ట
ప్రధాని మోడీ పర్యటనతో  నేపాల్‌లో భారత ప్రతిష్ట ఎవరెస్టును తలపిం చింది. 17ఏళ్ల తరువాత నేపాల్‌ని సందర్శించిన భారత ప్రధానిగా మోడీ ఒక రికార్డు నెలకొల్పారు. నేపాల్ మావోయిస్టు పార్టీ బలం పుంజుకున్నప్పటి నుండి భారత్‌ను ఒక శత్రుదేశంగా ప్రచారం చేస్తూ వచ్చింది. దీనితో భారత్‌తో అవిభాజ్య కుటుంబంలా ఉండే నేపాల్ వ్యవహారాలలో చైనా వేలు పెట్టటానికి అవకాశం ఏర్పడింది. మోడీ లాంటి ప్రధాని రాకపోయి ఉంటే నేపాల్  పాకిస్థాన్‌లా చైనా అదుపులోకి వెళ్లేదేమో! నేపాల్‌లోని ఆరువేల నదులు, ఉపనదులపై విద్యుత్ కేంద్రాలను నిర్మించగలిగితే కొన్నివేల మెగా వాట్ల కరెంటు తయారవుతుంది. అందులో 25శాతం మించి ఆ దేశానికి అవ సరం లేకపోవడంతో మిగిలిన దాన్ని భారత్ కొనుగోలు చేస్తుందని మోడీ స్పష్టం చేశారు.
 
భారత్ కొనుగోలు చేసే విద్యుత్తుకు చెల్లించే నిధులతో నేపాల్ సంపన్న దేశంగా మారుతుందని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగం, తక్కువ ధరతో నిర్మించే గృహాలు, ఆరోగ్యం, విద్యా రంగాల్లో పెద్ద ఎత్తున సహకరిస్తామని హామీ ఇచ్చారు.  నేపాల్ ప్రజలకు ఆయన ఒక బృహ త్తరమైన కానుకను కూడా తీసుకెళ్లారు. 16 ఏళ్ల క్రితం దారితప్పి అహ్మదా బాద్ చేరుకున్న జీత్ బహదూర్ అనే పదేళ్ల బాలుడి పెంపకం బాధ్యతను తనే తీసుకొని ఈ పర్యటనలో అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ దృశ్యం నేపాలీలను కంటతడి పెట్టించింది.
 
నేపాల్ ప్రభుత్వానికి అనిష్టంగా మారిన 1950 ఒప్పందానికి మార్పులు చేస్తామని మోడీ ఇచ్చిన హామీ సుశీల్ కొయిరాల ప్రభుత్వానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మోడీ పర్యటించిన ఆగస్టు 3, 4 తేదీలను నేపాల్ సెలవు దినా లుగా ప్రకటించింది. రెండు నెలల్లోనే దౌత్య సంబంధాల్లో మోడీ సాధించిన ఈ అద్భుతాలు వచ్చే ఐదేళ్లలో భారత్‌ను అగ్రదేశాల సరసన నిలబెడతాయని ఆశించవచ్చు.
 (వ్యాసకర్త ఎంఎల్‌ఏ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement