మన కాలపు జననేతల్లో అత్యుత్తముడు...!?
కేంద్ర ప్రభుత్వంపై ప్రతికూల వార్తలు మీడియాలో హోరె త్తుతున్నప్పటికీ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రాభవం మాత్రం చెక్కుచెదరడం లేదు. దృఢమైన వ్యక్తిత్వం ద్వారా బీజేపీ వైపు తానాకర్షించిన ప్రజా బృందం మద్దతును ఇప్పటికీ ఆయన నిలుపుకోగలుగుతున్నారు. తన ప్రాభవం కూడా క్రమంగా హరించుకుపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇతర నేతలెవ్వరికీ సాధ్యం కాని శిఖరస్థాయిని మోదీ అంటిపెట్టుకుంటూనే ఉన్నారు.
గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు, నరేంద్రమోదీ తన పార్టీకి అమాంతంగా 32 శాతం ఓట్లు సాధించి పెట్టారు. అంటే వాజపేయి హయాంలోనూ, తదనంతర కాలంలో బీజేపీ సాధించిన సగటుకు మోదీ 10 శాతం ఓట్లను అదనంగా సాధించారని అర్థం. రెండు విభిన్నమైన, వేరువేరు బృందాల నుంచి మోదీకి మద్దతు లభిస్తోం దని నా నిశ్చితాభిప్రాయం. వీటిలో ప్రధాన బృందం భారతీయ జనతా పార్టీ ఓటర్లే. వీరు ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. దీన్ని బట్టి హిందుత్వ, ముస్లింలపట్ల అయిష్టత అనేవి మూడు కీలకమైన అంశాల ద్వారా వ్యక్తమవుతుం టాయని నా ఉద్దేశం. అవి ఏమిటంటే... రామజన్మభూమి (ముస్లింలు తమ మసీదును వదులుకోవాలి), ఉమ్మడి న్యాయ స్మృతి (ముస్లిలు తమ కుటుంబ చట్టాన్ని వదులుకోవాలి), చివరిది ఆర్టికల్ 370 (ముస్లింలు కశ్మీర్‌పై తమ స్వయంప్రతిపత్తిని వదులుకోవాలి).
అయితే నా ఉద్దేశం ప్రకారం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సామాజిక కృషిని సైద్ధాంతిక స్ఫూర్తిగా కలిగిన విశిష్టపార్టీగా బీజేపీని ఆరాధించేవారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కులీన, వంశపారంపర్య గాంధీ కుటుంబం నుంచి బీజేపీని ఇదే వేరుపరుస్తోంది.
ఇకపోతే, మోదీ ఆకర్షణ ద్వారా ప్రధానంగా పార్టీలోకి వచ్చినవారే బీజేపీ ఓటర్లలోని రెండో బృందం. అత్యంత సంక్లిష్ట అంశాలను సాధారణ నినాదాలుగా కుదించగలిగిన అద్భుత వక్తగా మోదీ వీరి దృష్టిలో ఒక విశ్వసనీయుడిగా గుర్తింపు పొందారు. (తన శ్రోతలతో నేరుగా కనెక్ట్ కాగలగడంలో బాల్‌థాకరే, లాలూ యాదవ్‌తో సమాన శ్రేణిలో నిలువదగిన నేతగా నేను మోదీని అంచనా కట్టే వాడిని కానీ, దశాబ్దాల కాలంలో మనం రూపొందించుకున్న నేతలలో ఆయనే అత్యుత్తముడని నేనిప్పుడు భావిస్తున్నాను.) ఆయన భార త జాతీయవాదపు అతి గొప్ప ప్రతినిధి. తన సమ్మోహన శక్తి కారణంగా ఆయన పరమ ఆకర్షణీయ వ్యక్తి. నవ్య భారత్, తన పాలనలో కొత్త ప్రారంభం గురించి ఆయన చేసిన వాగ్దానానికి ఈ రెండో బృందం సాకల్యంగా లోబడిపోయింది.
ఈ నేపథ్యంలోనే వాస్తవికతలో గానీ లేదా ప్రభుత్వ కార్యకలాపాలు నడిచే తీరులో గానీ భారత్ నిజానికి పెద్ద వ్యత్యాసంతో లేదన్న వార్తలను మనం గ్రహిం చడం ప్రారంభించాము. మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు. సంస్కరణల రేటుకు సంబంధించి మూడీస్ క్రెడిట్ రేటింగ్ నిరాశాజనకమైన నివేదికను ప్రకటించింది. ఈ వారం దారిద్య్రంపై వెలువరించిన ప్రతికూల నివేదిక గ్రామీణ భారతీయ కుటుంబాలలో 92 శాతం నెలకు రూ.10 వేలకంటే తక్కువ ఆదాయంతోటే మనుగడ సాధిస్తు న్నారని సూచించింది.
కేంద్రంలోనూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మంత్రుల కుంభకోణాలపై ప్రస్తుతం టీవీ షోలు వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ చివరిరోజుల్లో ఏర్పడిన స్థాయికి సమానంగా పరిణా మాలు చోటుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొన లేదని ఒక ముఖ్య పరిణామం చెబుతోంది. మోదీకి వ్యక్తిగతంగా లభిస్తున్న మద్దతు క్షీణించడం లేదని చూపిస్తూ గత కొన్ని వారాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో నమోదైన అసాధారణ ఎన్నికల ఫలితాలు దీన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. మరీ ముఖ్యంగా త్రిపురలో అయితే కాంగ్రెస్ అభ్యర్థికంటే బీజేపీ అభ్యర్థి ఆధిక్యతలో నిలిచారు. ఇది నిజంగానే గుర్తించదగిన విషయం.
ఇక కేరళలో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంలో నిలిచారు. ఈయన పార్టీలో ప్రజాకర్షక నేత. అంతకుముందు ఎన్నికల్లో ఇదే స్థానంలో పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఈయనకు ఈ దఫా ఎన్నికల్లో ఓట్లు పడ్డాయి. ఇది కేరళలో బీజేపీ కమల వికాసాన్ని సూచిస్తోందని కొందరన్నారు. ఈ అభిప్రాయం వాస్తవం కాకపోవచ్చు గాక.. అయితే మోదీ ప్రభుత్వం గురించి మీడియా ఇటీ వలి కాలంలో ప్రతికూల వార్తలతో హోరెత్తిస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రాభవం మాత్రం చెక్కుచెదరలేదని ఇది సూచిస్తోంది. మరోవైపున ఒక సంవత్సరం క్రితం మోదీని వాగ్దానాలు నిలుపుకునే నేతగా ప్రపంచ దేశాల్లో ఏర్పడిన అభిప్రాయం తగ్గుముఖం పట్టనారంభించింది. భారత ప్రభుత్వ వ్యవహారాలపై రోజువారీ కథనాల్లో, మోదీ గురించిన ఎరుక, ఆయన వాగ్దానాల అమలు రెండింటినీ మీడియా ఇటీవల కాలంలో ఉతికి ఆరేస్తున్నప్పటికీ, ఆయన మాత్రం వ్యక్తిగతంగా తన పట్టును ఎలా నిలుపుకో గలిగారు?
బీజేపీలోకి తాను ఆకర్షించిన పై రెండో బృందం ప్రజలను విజయవంతంగా నిలుపుకోగలిగినందుకే మోదీ ప్రయాణం సజావుగా సాగుతోందని నేను భావిస్తు న్నాను. మోదీని ఆరాధించేవారు, సకాలంలో తను మార్పును తీసుకురాగలరని విశ్వసిస్తున్నవారు నేటికీ అయన వెన్నంటే ఉన్నారు. ఇన్ని చెడు వార్తల మధ్య కూడా, తన పంథాను ఆయన వదలలేదనే భావన మద్దతుదారుల్లో ఏర్పడకుండా మోదీ విజయవంతం కాగలిగారు.
ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఆయన అనుసరిస్తున్న ప్రత్యక్ష కమ్యూని కేషన్ ద్వారానేనని చెప్పాలి. ఆ అర్థంలో మీడియా నుంచి మోదీ స్వతంత్రుడిగా ఉన్నారు. టీవీ యాంకర్లు, రిపోర్టర్లు కోరుకుంటున్న తరహా అంశాలపై (ఉదాహ రణకు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే.. వారికి లలిత్‌మోదీతో ఉన్న సంబం ధాలు వంటివి) ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేయనప్పటికీ ట్వీటర్ ద్వారా, ప్రజలను ఉద్దేశించి తాను చేసే ప్రసంగాల ద్వారా తనను అభిమానించే వారిని మోదీ ఇప్పటికీ నిలుపుకుంటున్నారు.
దాదాపు ప్రతి రాజకీయ పార్టీకి చెందిన నేతలు, వ్యక్తులతో ముడిపడివున్న ఐపీఎల్ కుంభకోణంకి చెందిన విస్తృత స్వభావం కారణంగా మోదీ ప్రతిష్ట ఇప్పటికే కాస్త మసకబారి ఉండాలి. కానీ తన పార్టీకి వెలుపల స్వతంత్రంగా (పైన చెప్పిన రెండో బృందంలో) మోదీకున్న ఆకర్షణకు సంబంధించిన అంశమే ఆయ నను గందరగోళం నుంచి కాపాడుతోంది. దాని ఫలితం ఏమిటంటే, మన కాలంలోని ఏ ఇతర నాయకుడి కంటే మిన్నగా తన అభిమానులు ఆయన్ని ఎత్తిపడుతున్నారు.
తన హయాంలో కొత్తగా మరిన్ని కుంభకోణాలు బయటపడటం భవిష్య త్తులో కొనసాగినప్పటికీ, ఇతర నేతల కంటే మోదీ తన స్థానాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుకొనడాన్ని కొనసాగించగలరా? లేదు. ఈ దేశానికి సంబంధించిన ఘోర మైన, భీతిగొలిపే పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రాభవం క్రమంగా హరించుకు పోవడం తప్పకపోవచ్చు. కానీ, ప్రస్తుతానికైతే.. ఏ ఇతర నేతకైనా మలినం అం టక తప్పని కాలంలోనూ తాను శిఖరస్థాయిలోనే ఉండేలా మోదీ చక్కగా వ్యవ హారాలు చక్కదిద్దుకుంటున్నారు. అదే ఆయన విశిష్టత.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
- ఆకార్ పటేల్