ఎవరికి చెప్పాలి పాఠం? | No answer from Chandrababu naidu when oppostion ask questions ? | Sakshi
Sakshi News home page

ఎవరికి చెప్పాలి పాఠం?

Published Thu, Mar 31 2016 1:50 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

ఎవరికి చెప్పాలి పాఠం? - Sakshi

ఎవరికి చెప్పాలి పాఠం?

ప్రతిపక్ష నేత లేవనెత్తే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానమే లేదు. పైగా మొండిగా వాదిస్తూ, వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిపక్షనేతకే పాఠాలు చెబుతాననడం చూసి రాష్ర్ట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చిలోనే భగభగలాడిన భానుడి ప్రతాపాన్ని ప్రతిబింబించాయి. సమావేశాలను ఆసాంతం పరిశీలించిన వారికి అవి జరిగిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. జీవోలు, గణాంకాలు, రిపోర్టులను ఆధారాలుగా చూపిస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలు సంధిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పకపోగా అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ ఎదురుదాడి చేయడం... అందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నాయకత్వం వహించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ముగింపు ముందురోజు ముఖ్యమైన రెండు అంశాలపై చర్చ జరిగిన తీరు పరిశీలిస్తే చాలు ఈ సమావేశాలు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి.
 
  పట్టిసీమపై చర్చ సందర్భంగా ప్రతిపక్షనేత ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఇరిగేషన్ చాలా క్లిష్టమైన సబ్జెక్టని, తెలియకపోతే తాను పాఠాలు చెబుతానని చంద్రబాబు వాఖ్యానించడం విస్మయపరిచింది. అలాగే ఉపాధి హామీ పథకం అమలు విషయంలో మానవీయకోణాన్ని విస్మరిస్తూ ముఖ్యమంత్రి చేసిన వాదన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చట్టాన్ని, నిబంధనలను ససాక్ష్యంగా ఏకరువు పెడుతున్నా మొండిగా వాదిస్తూ తనకు తెలిసిందే నిజమని, తాను చెప్పిందే అందరూ నమ్మాలన్నట్లు ముఖ్యమంత్రి వాదించడం చూసి అందరూ విస్తుపోయారు. ఈ రెండు ఉదంతాలలోనూ ముఖ్యమంత్రికి - ప్రతిపక్షనేతకు మధ్య జరి గిన సంవాదాన్ని చూస్తే చాలు ఎవరు ఎవరికి పాఠాలు నేర్పాల్సి ఉంది..? ఎవరు ఎవరి వద్ద పాఠాలు నేర్వాల్సి ఉందనేది తేలిగ్గానే అర్థమైపోతుంది.
 
 పట్టిసీమపై జవాబు లేని ప్రశ్నలు...
 ముందుగా పట్టిసీమనే తీసుకుందాం. ఏడాది వ్యవధిలో పట్టిసీమను పరమాద్భుతంగా పూర్తిచేసేశామని ముఖ్యమంత్రి ‘సగర్వం’గా సభకు వివరించారు. నిజమే.. పట్టిసీమను పూర్తిచేశారు కానీ అదొక నిరుపయోగమైన, నిష్ఫలమైన, రాష్ర్ట రైతాంగానికి నష్టదాయకమైన ఎత్తిపోతల పథకమని ప్రతిపక్షనేత ఆధారసహితంగా వివరిస్తుంటే ముఖ్యమంత్రి సహించలేకపోయారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా.. ఒక పార్టీ అధినేతగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా అన్ని అంశాలనూ కూలంకషంగా అధ్యయనం చేస్తూ.. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ (పత్రాల ఆధారాలు)తోనే జగన్‌మోహన్‌రెడ్డి సభలో మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ అంశం తీసుకున్నా ఎలాంటి ఆధారమూ లేకుండా ఆయన మాట్లాడడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోనో, నిబంధనలనో, గతంలో అమలు చేసిన వివరాలను తెలిపే పత్రాలనో సభకు చూపిస్తూనే ఆయన వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టిసీమ పథకంలో రూ. 1600 కోట్లను నీళ్లపాలు చేశారని అంటూనే అది ఎందువల్ల నిరుపయోగమో జగన్ వివరించారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలను, వివరించిన అంశాలనూ పరిశీలిస్తే...
 
 1.    పట్టిసీమలో అస్సలు స్టోరేజీ సామర్థ్యం లేదు. కేవలం గోదావరిలో నీరున్నపుడు ఆ నీటిని పంపులతో ఎత్తిపోసే పథకమిది. అంటే పంటల సమయం, వాటి అవసరాలతో నిమిత్తం లేకుండా గోదావరిలో నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు అన్నమాట. గోదావరిలో వరదలు వచ్చే సమయానికి కృష్ణాలోనూ వరదలు ఉంటాయి. కృష్ణాడెల్టాలో పంటల కాలానికి కూడా పొత్తు కుదరదు. అందుకే 190 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టును కట్టుకుంటేనే గోదావరి వరదనీటిని ఉపయోగించుకునే వీలుంటుంది. స్టోరేజీ సామర్థ్యం లేని పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి? ఈ 1,600 కోట్ల రూపాయలు పెడితే పోలవరం ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. ఇవే రూ.1,600 కోట్లతో గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యేది. ఈ రూ. 1,600 కోట్లు పెడితే హంద్రీ నీవా కూడా దాదాపు పూర్తయ్యేది. ఎలాంటి ఉపయోగమూ లేని పట్టిసీమకు రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టడం దేనికి?
 
 2.    పట్టిసీమ ద్వారా నీటిని సరఫరా చేసి కృష్ణాడెల్టా అవసరాలను తీర్చేసి తద్వారా కృష్ణానదిలో మిగిలే జలాలను రాయలసీమకు తరలించి సీమను సశ్యశ్యామలం చేసేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. పట్టిసీమ పథకంతో కేవలం 4 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయడం సాధ్యం. 180 టీఎంసీలు అవసరమయ్యే కృష్ణా డెల్టా అవసరాలను 4 టీఎంసీలు ఎలా తీరుస్తాయి? రాయలసీమకు నీళ్లెలా మిగులుతాయి?
 3.    రాయలసీమకు నీళ్లు తరలించాలంటే శ్రీశైలం వద్ద 854అడుగుల మేర కనీస నీటి మట్టం ఉండాలి. అలా కనీస నీటిమట్టాన్ని ఉంచుతున్నారా అంటే సమాధానం లేదు. పాలమూరు, రంగారెడ్డి వంటి కొత్త పథకాలకు తెలంగాణ టెండర్లు పిలుస్తూ ముందుకెళ్తున్నా అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు ఎందుకు చేయడం లేదు? అసలు గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ర్ట ఒప్పందాలు చేసుకుంటున్నా దిగువ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు పిలవడం లేదు? పిలవకపోయినా ఆంధ్రకు నష్టం కలిగించేలా అనేక ఒప్పందాలు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎందుకు ధైర్యం చేయడం లేదు? ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసును బయటకు తీస్తారని భయపడడం నిజం కాదా?
 4.    గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం.. బేసిన్ మారితే ఎగువరాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కోల్పోవాల్సి ఉంటుందని 7(ఇ), 7 (ఎఫ్) క్లాజులు చెబుతున్నాయి. 190 టీఎంసీలని నిల్వచేసుకునే సామర్థ్యంతో కృష్ణా డెల్టా అవసరాలతో పాటు రాష్ర్టంలోని 13 జిల్లాలకూ ఉపకరించే వరప్రదాయిని వంటి పోలవరం కోసం ఎగువరాష్ట్రాలకు 35 టీఎంసీలను కోల్పోయినా నష్టం లేదు కానీ కేవలం 4 టీఎంసీల పట్టిసీమ కోసం 35 టీఎంసీలను ఎందుకు ఫణంగా పెట్టారు?
 5.    నదుల అనుసంధానం చేసేశానని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఆయన చేసిందేమిటి? పోలవరం అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టే శరవేగంగా తగినన్ని నిధులు కేటాయించి పోలవరం పనులు ప్రారంభించడంతో పాటు కుడి, ఎడమ కాల్వలను అంతే వేగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తిచేశారు. ఆయన కాలంలోనే పోలవరం కుడికాల్వ 70శాతం పూర్తయింది. మిగిలిన కొద్ది భాగంలో వెడల్పు తక్కువ పిల్లకాల్వలను తవ్వించి లిఫ్టు మోటార్లు బిగించి అదే పెద్ద ఘనకార్యమైనట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఈ కాస్త పనులకు రూ.1600 కోట్లు ఎందుకు బాబూ? ముడుపులు మింగేయడానికి తప్ప ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఏ కాస్త ప్రయోజనమన్నా ఉందా? ప్రతిపక్ష నేత లేవనెత్తే ప్రశ్నలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానమే లేదు. పైగా మొండిగా వాదిస్తూ, వ్యం గ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిపక్షనేతకే పాఠాలు చెబుతాననడం చూసి రాష్ర్ట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
 
 ఉపాధిహామీ చట్టానికీ వక్రభాష్యాలు..
 ఇక ఉపాధి హామీ చట్టం అమలుపై జరిగిన చర్చలోనూ ముఖ్యమంత్రి ఇదే తరహా మొండివాదన చేయడం ప్రజలంతా గమనించారు. తనకు తెలిసిందే చట్టమన్నట్లు మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ నిధులలో దేనికి ఎంత ఖర్చు చేయాలనేదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.  60శాతం కూలీల వేతనాలకు, 40శాతం మెటీరియల్‌కు ఖర్చు పెట్టాలని చట్టంలో ఉందని, తాము అదే చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అయితే మెటీరియల్ కాంపొనెంట్ 40శాతం నిధులను పొక్లెయిన్లతో పనులు చేస్తూ నిర్మించే సీసీరోడ్లకు ఎందుకు మళ్లిస్తున్నారని ప్రతిపక్షనేత నిలదీశారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచించదగినవే. వాటికి ముఖ్యమంత్రి వద్ద సమాధానమే లేదు. చట్టంలోని అంశాలను, గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను జగన్ సాక్ష్యాలతో సహా వివరించారు. వాటిని సూక్ష్మంగా పరిశీలిస్తే...
 
 1.    ఉపాధి హామీ చట్టం - 2005 లేబర్ బడ్జెట్ చాప్టర్ 8.4.4 నిబంధన ఏం చెబుతోందంటే ఉపాధి నిధులలో కనీసం 60శాతాన్ని కూలీల వేతనాలకు ఖర్చుపెట్టాలి. గరిష్ట పరిమితి లేదు. దానర్థం పూర్తిగా 100 శాతం కూడా ఖర్చుపెట్టవచ్చు. అలాగే మెటీరియల్ కాంపొనెంట్ గరిష్టంగా 40శాతం ఖర్చుచేయవచ్చు. దానర్థం 1 శాతం నుంచి 40శాతం లోపు ఉండాలని... అంతేకానీ కచ్చితంగా 40శాతం మెటీరియల్ ఖర్చులకు వినియోగించాలని కాదు. రాష్ర్టంలో పరిస్థితులను బట్టి రాష్ర్టప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూలీలకు ఆసరాగా ఉండేలా ఎక్కువ పనులు కూలీలతో చేయించి నిధులలో అధికభాగాన్ని వారి వేతనాలకు వెచ్చించడం మానవత్వం ఉన్న పాలకుడు చేయాల్సిన పని. కానీ చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. పైగా చట్టానికి వక్రభాష్యం చెప్పేందుకు ప్రయత్నించారు.
 
 2.    పొక్లెయిన్లతో పనులు చేయించి సీసీరోడ్లు నిర్మిస్తే కాంట్రాక్టర్లు బాగుపడతారు. కానీ కూలీలకు పనులు కల్పిస్తే వారికి మూడుపూటలా పట్టెడన్నం దొరుకుతుంది. ఇంత చిన్న లాజిక్ ప్రజలు గ్రహించలేరనా చంద్రబాబు అభిప్రాయం?
 3.    కూలీలకు మరిన్ని పనులు కల్పించి మరిన్ని వేతనాలివ్వాలనే ఉద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉపాధి నిధులలో 97. 54శాతాన్ని వేతనాలకు ఖర్చుచేశారు. మెటీరియల్ ఖర్చులకు కేవలం 2.46శాతం మాత్రమే వెచ్చించారు. తమిళనాడులో పూర్తిగా 100శాతం నిధులను కూలీల వేతనాలకే ఖర్చు చేస్తున్నారు.
 
వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం మొండిగా వాదించడానికి ప్రయత్నించారు. ఇది కేంద్రం తెచ్చిన చట్టమని, ప్రతిపక్షనాయకుడికి ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అంటూ పిడివాదం వినిపించారు. అన్ని విషయాలలోనూ పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే ఉపాధి హామీ చట్టంలోని నిబంధనలను సభలో చదివి వినిపించారు. వైఎస్ హయాంలో కూలీల వేతనాలకు ఎంతశాతం ఖర్చు చేశారో ఆధారాలతో సహా చూపించారు. దాంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. యథాప్రకారం స్పీకర్ మైక్ కట్ చేసి సభను వాయిదా వేశారు.
 
తెలియదనుకోవాలా? ట్యూషన్ చెప్పించాలా?
సహజంగానే ఉండే సంఖ్యాబలం, అధికార బలానికి సభాపతి సహకారం కూడా తోడుకావడంతో అధికారపక్షం ఈ సమావేశాల్లో ఆకాశమే హద్దుగా ‘ఏకపక్షం’గా చెలరేగిపోయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ, బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగానూ, ప్రభుత్వంపైనా - స్పీకర్‌పైనా ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ సందర్భంగానూ ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్షనేత ఒక అంశంపై ఒక వాక్యం కూడా పూర్తి చేయకుండానే మైక్ కట్ కావడం, వెంటనే అధికారపక్షం నుంచి మంత్రులు, విప్‌లు, సభ్యులలో ఎవరో ఒకరు లేచి ఆ అంశంపై సుదీర్ఘమైన ప్రసంగం చేయడమే కాక వ్యక్తిగతదాడికి దిగడం ఈ సమావేశాల్లో కనిపించిన ప్రత్యేకమైన అంశం. శాసనసభలో మున్నెన్నడూ కనిపించని ఓ కొత్త దుస్సంప్రదాయమిది. వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించడం, న్యాయస్థానాల పరిధిలో ఉన్న కేసుల గురించి కూడా వ్యాఖ్యానాలు చేయడం యథేచ్చగా సాగిపోయాయి.  40 ఏళ్ల ‘సుదీర్ఘరాజకీయ అనుభవం’ ఉన్న చంద్రబాబుకు ఇవి తప్పు అని తెలియదనుకోవాలా? లేక సభా సాంప్రదాయాల గురించి ఈ ‘చరమాంకం’లో ఆయనకు ట్యూషన్ చెప్పించాలా?
 - పోతుకూరు శ్రీనివాసరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement