నల్లధనంపై తెల్లముఖం! | RBI extends exchange date of pre-2005 notes to January 1, 2015 | Sakshi
Sakshi News home page

నల్లధనంపై తెల్లముఖం!

Published Thu, Mar 6 2014 1:31 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లధనంపై తెల్లముఖం! - Sakshi

నల్లధనంపై తెల్లముఖం!

కరెన్సీ నోట్ల మార్పిడికి ఇచ్చిన గడువును ఆర్‌బీఐ ఎందుకు పొడిగించింది? దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు కక్కించడమే ఈ నోట్ల మార్పిడి వెనుక ఉన్న లక్ష్యమని అంతా అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలూ నల్లధనాన్ని మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతున్న సందర్భంలో ఈ నిర్ణయం  పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) సర్వ స్వతంత్రమైన సంస్థా? లేక పాలక పార్టీకి తాబేదారు సంస్థా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తప్పకుండా ఈ అనుమానం కలుగుతుంది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు చెల్లుబాటు కావనీ, వాటిని బ్యాంకులలో సరెండర్ చేసి కొత్త నోట్లను తీసుకోవచ్చనీ ఆర్‌బీఐ ఆ మధ్య ప్రకటించింది. ఇలా చెప్పిన నెలన్నరకే నిర్ణీత గడువును వచ్చే జనవరిదాకా పొడిగించడానికి వెనుక కారణం ఏమిటి? ఇలా పాత కరెన్సీ నోట్ల స్థానే కొత్త నోట్లను జారీచేయడం భద్రత కారణాలరీత్యా అన్ని దేశాలలోనూ సర్వసాధారణంగా జరిగే పరిణామమే కాబట్టి ఇక్కడ కూడా జరుగుతోందని సరిపెట్టుకుందామా? దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు కక్కించడమే ఈ నోట్ల మార్పిడి వెనుక ఉన్న లక్ష్యమని సర్వదా అంతా అనుకుంటున్నారు. అసలు లక్ష్యం అదే అయితే ఆహ్వానించదగిందే. కాని ప్రజలు పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసుకునేందుకు గడువును ఆర్‌బీఐ ఎందుకు పొడిగించిన ట్టు?
 
 నల్లధనం గుట్టలుగుట్టలుగా కొద్దిమంది చేతుల్లో, ముఖ్యంగా బడా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో వందమంది అత్యంత ధనవంతుల పేర్లనూ, వారి ఆస్తుల విలువనూ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక 2014 మార్చి1న ప్రచురించింది. అదేవిధంగా 2012, 2013లో వీరి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించింది. తొలి ముగ్గురి స్థానాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
 
 ఒక సంవత్సరంలో, అందులోనూ ఆర్థిక మాం ద్యంలో దేశం కొట్టుమిట్టాడుతున్న సంవత్సరంలో వీరి ఆస్తుల విలువ ఎలా పెరిగిందో గమనించాలి. ఈ వందమంది కుబేరులకు చెందిన కంపెనీల షేర్లను అమ్మేస్తే దాని మొత్తం విలువ రూ. 12,02,364 కోట్లు అవు తుంది. అంటే మన బడ్జెట్ లోటు ఈ సంవత్సరం రూ. 5,24,539 కోట్లను భర్తీ చేయడమే కాకుండా వచ్చే ఏడాది లోటు అంచనా రూ. 5,28,631 కోట్లను కూడా భర్తీ చేయవచ్చు. ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుంది. ఈ భారత కుబేరులు దేశానికి సేవ చేసిన వారవుతారు. ఇంకా వారి వద్ద రూ. 1,50,000 కోట్లు మిగులు ఉంటుంది. అందుకనే ఒక బ్రిటిష్ పౌరుడు మన దేశాన్ని సందర్శించిన తర్వాత ‘‘భారతదేశం ధనికదేశమేగానీ, భారతీయులు మాత్రం పేదవారు’’ అని అభివర్ణించారు.
 
 
 పారిశ్రామికవేత్త    2012    2013(రూ.కోట్లలో)
 ముకేశ్ అంబానీ    1,11,464    1,17,161
 అజీమ్ ప్రేమ్‌జీ    69,322    94,667
 సునీల్ మిట్టల్    82,733    85,662
 
 ఇవి ప్రకటించిన ఆస్తులైతే, ఇక ప్రకటించకుండా దాచిన ఆస్తులు, నల్లధనం ఎంత ఉందో, స్విస్ బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో ఎంత మూలుగుతోందో తెలియదు. సంపన్నుల వద్ద నల్లధనం బంగారం వస్తువుల రూపంలోగానీ, పుత్తడి ముద్దల రూపంలోగానీ ఉంటుంది. నోట్ల రూపంలో దాచుకోరు. అది ఆర్‌బీఐ లెక్కల్లోకి రాదు. కరెన్సీ నోట్ల మార్పిడికి ఇచ్చిన గడువును ఆర్‌బీఐ ఎందుకు పొడిగించింది? సార్వత్రిక  ఎన్నికల షెడ్యూలు వెలువడింది. అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్షపార్టీ, వివిధ స్థాయిలో ఉన్న ఆయా పార్టీల నాయకులు ఓట్ల కొనుగోలు కోసం నల్లధనాన్ని మంచినీళ్లప్రాయంగా ఉపయోగిస్తున్నారు. ఇది రహస్యమేమీ కాదు. అంత ధనాన్ని మార్చేందుకు బ్యాంకుల వద్దకు పోతే గుట్టురట్టవుతుంది. ఓట్లు రాలవు. ఓడిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దేశంలోని బడా  కార్పొరేట్లు తమ వద్దనున్న నల్లధనాన్ని ప్రభుత్వం నుంచి తమకు కావల్సిన పనులు చేయించుకోడానికి ఉపయోగిస్తారు.  అవినీతి ఇప్పటికే కంపు కొడుతూంది. అవినీతిని నిరోధించడం కోసమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టామని చెప్పుకుంటున్న పాలకపార్టీ ఓట్ల కొనుగోలు కోసం నల్లధనాన్ని  వినియోగిస్తుందనేది రహస్యమేమీ కాదు.
 
 ప్రముఖ ఆర్థికవేత్త, హిందూ-బిజినెస్‌లైన్ పత్రికలో రెగ్యులర్‌గా ఆర్థికాంశాలపై రాసే కాలమిస్ట్ సీపీ చంద్రశేఖర్ ఇటీవల రాసిన వ్యాసంలో ఒక మాట చెప్పారు. కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ ఇపుడు చేస్తున్నది ఒక విలువ  కలిగిన నోట్లను పూర్తిగా తొలగించడమో లేదా రద్దు చేయడమో కాదు. కేవలం ఆ పాత నోట్లకు బదులు కొత్త నోట్లను మార్పిడి చేయడమేనని అన్నారు. ‘‘అనేక దేశాల్లో ఇటువంటి పద్ధతి అమల్లో ఉంది. పైగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు నకిలీ తయారు చేయకుండా నివారించగల, మరిత మెరుగైన భద్రతా లక్షణాలు కలిగిన నోట్లు చలామణిలో ఉండేలా చూడడమే ఈ చర్యల వెనుక లక్ష్యం. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా ఆర్‌బీఐ బయటపెట్టాలి.
 
 లేనిపక్షంలో నల్లధనం దాచుకున్న వారివద్ద ఉన్న లెక్కలోకి రాని ఆదాయం, సంపదకు రహస్య క్షమాభిక్షగా మాత్రమే ఈ పథకం ఉపయోగపడుతుంది.’’ అని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఇప్పుడు గడువును ఇంకా పొడిగించడం చూస్తే క్షమాభిక్ష మాత్రమే కాదు, అలాంటి నల్లధనాన్ని ఓట్ల కొనుగోలుకు వినియోగించుకోవలసిందిగా నేరుగా చెప్పడమే. అవినీతికి నారువేసి నీరుపోసి పెంచడమే అవుతుంది. రిజర్వు బ్యాంకును పాలకపార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే అవుతుంది. ఈ నల్లధనం ఎన్నికలలో ఓటర్లకు పంచిపెడితే సులువుగా చలామణి అయిపోతుంది. ఓటర్ల చేతుల్లోకి వెళ్లిన అదనపు ధనం వారి నిత్యావసరాలకు వినియోగించడం కన్నా తాగుడుకు ఖర్చయిపోతుందని అనుభవం చెబుతుంది. మద్యం అమ్మకందారుల పంటపండుతుంది. పేదకుటుంబాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
 
 ఇది భారతదేశంలోని ఒకవైపు చిత్రం. రూపాయికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే దేశానికి రెండో వైపు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదాహరణకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలోనే శంషాబాద్ మండల పరిధిలోని కవ్వగూడ గ్రామపంచాయితీలో  350 కుటుంబాలు  ఎలా నివసిస్తున్నాయో చూడండి. ఏ వీధిలోనూ మురుగుకాల్వలు లేకపోవడంతో మురుగునీరు ఏరులై పారుతోంది. రోడ్లన్నీ అధ్వానంగా పడిఉన్నాయి. రైతులకు, మత్స్యకారులకు రుణాలు లభిం చడం లేదు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఇక్కట్ల పాలవుతున్నారు. గ్రామంలో కంప్యూటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గ్రామానికి ఇండిపెండెంట్ సర్పంచ్ ఎన్నికైనప్పటికీ అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇలాంటి దేశాన్ని అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారా? తిరిగి అధికారంలోకి పంపించాలనుకుంటున్నారా? ఆలోచించండి.    
 (వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు)
 వి. హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement