
గుజరాత్ 'నమో' నా...అమ్మో!
అవినీతిపై పోరు గురించి పదేపదే మాట్లాడుతున్న నరేంద్ర మోడీ తమ రాష్ట్రంలో లోకాయుక్త నియామకాన్ని పదేళ్లుగా అడ్డుకుంటున్నది దేనికి? పాలనలో అవినీతినీ, రాజ్యాధికార నిరంకుశ, అరాచక చర్యలనూ లోకాయుక్త విచారణ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడేందుకే! గుజరాత్ ‘నమూనా అభివృద్ధి’ అంటే ఇప్పడు అర్థమైంది గదా. ఒట్టి ‘ఊదర’ అని!
అవినీతిపై పోరు గురించి పదేపదే మాట్లాడుతున్న నరేంద్ర మోడీ తమ రాష్ట్రంలో లోకాయుక్త నియామకాన్ని పదేళ్లుగా అడ్డుకుంటున్నది దేనికి? పాలనలో అవినీతినీ, రాజ్యాధికార నిరంకుశ, అరాచక చర్యలనూ లోకాయుక్త విచారణ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడేందుకే! గుజరాత్ ‘నమూనా అభివృద్ధి’ అంటే ఇప్పడు అర్థమైంది గదా. ఒట్టి ‘ఊదర’ అని!
‘‘ఈ ఎన్నికల నాటకాన్ని పరిశీలిస్తున్నకొద్దీ ఒక్కో అభ్యర్థి తనదైన ప్రాపంచిక దృక్పథాన్నో, సొంత తత్వాన్నో ప్రదర్శించుకోవడం కన్పిస్తుంది. రాహుల్ గాంధీ పతనావస్థలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రతినిధి, కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ పేరిట ఓ నూతన రాజకీయ వాతావరణానికి ప్రతినిధి. ఇక నరేంద్ర మోడీ భారతీయ జనతాపార్టీకి ఓ పేలవమైన ప్రతినిధి. మోడీ మాట్లాడే తీరులో సాధికారత, సందర్భ శుద్ధి కన్పించదు. ఆయన రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ఆయన నేర్చుకోవల్సింది అనంతం. మోడీలో నాగరిక లక్షణం తక్కువ. కృత్రిమమైన స్వదేశీ తత్వాన్ని సృష్టించడం ఆయనకు అలవాటు. ఆయన ‘స్వదేశీ’ భావన స్థానిక ప్రజలకూ, ప్రాంతానికీ సాధికారికత కల్పించేదికాదు. ఆయన రాజకీయం ఎంతసేపూ ‘గల్లీ’లో చిల్లర తరహా నాయకుడిదేగాని ఒక జాతి నాయకుడిది కాదు.’’
- ప్రొఫెసర్ శివ విశ్వనాథన్, జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ
గుజరాత్ ముఖ్యమంత్రి, ‘నమో’గా ప్రాచుర్యం పొందిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి భారత రాజ్యాంగ విషయాలలో ఎంతటి పరిజ్ఞానముందో మన కి తెలియదుగాని ఉన్నట్టుండి భారత రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘానికి అధ్యక్షుడిగానూ, రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడుగానూ గణుతికెక్కిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ఈమధ్య ఎక్కడలేని ‘ప్రేమ’, ‘గౌరవం’ పుట్టుకొచ్చాయి! దాంతోపాటు తన జీవితాంతం దేశంలోని అట్టడుగువర్గాల ప్రజల కడగండ్లు బాపడానికి, హైందవ సమాజంలోని వర్గ, వర్ణవివక్ష, దోపిడీలనుంచి, అవమానాల నుంచి వారిని విముక్తి చేయడానికి మహోన్నతస్థాయిలో పోరాడిన అంబేద్కర్‌ను కొత్తగా పొగడ్తలతో ముంచెత్తడానికి మోడీ ఎన్నికల వేళ ఉపక్రమించారు.
నిజానికి అంబేద్కర్‌ను న్యూనపరచడంలో, రకరకాలుగా అవమానపరచడంలో, రాజ్యాంగ రచనా క్రమంలోనూ, రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలలోనూ కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ పోటీపడుతూ వచ్చినవే! ఆ వాచా పొగడ్తలు, ఆచరణలో అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం! మనకొక్కటే నిదర్శనం. రాజ్యాంగం నడవడిక సవ్యంగా సాగితే తన గొప్ప అనీ, ఆ నడత సవ్యంగా సాగకుండా కుంటుతూ ఉంటే అదంతా అంబేద్కర్ తప్పు అని చాటడానికే నాటి కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్‌ను అలస్యంగా ముసాయిదా రచనా సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు! ఈ కుట్రను కనిపెట్టే అంబేద్కర్ సాధ్యమైనంత జాగరూకతతో మెలగవలసివచ్చింది. తరతరాలుగా బానిసత్వంలో మగ్గిన దళి తులు, అణగారిన వర్గాలు పడుతున్న బాధలకు అహిం సామార్గం ద్వారానే స్వాతంత్య్రానంతరం శాశ్వత విమోచన కల్గించడానికి రాజ్యాంగ రచనను ఒక మార్గంగా భావించాడాయన. కానీ స్వార్థపర వర్గం అడ్డంకుల మూలంగా రచనా ప్రక్రియలో ఆయన కొంతమేర రాజీ పడాల్సి వచ్చింది. అందుకు తర్వాత అంబేద్కరే నొచ్చుకోవలసివచ్చింది.
ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు.
ఈ రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలోనే అంబేద్కర్ సేవలు గుర్తుకు రావడం ఖండనార్హం. ఎందుకంటే దేశ సేవకులకు విగ్రహాలు నెలకొల్పడం, పద్మశ్రీలు, భారతరత్న బిరుదులివ్వడం అసలు నివాళి కాదు. భారత రాజ్యాంగ నిర్మాతగా ‘ఆదేశిక సూత్రాలు’ వేటిని భారత పాలకులు, రాష్ట్రాధినేతలు అమలు చేయాలని అంబేద్కర్ పేర్కొన్నారో వాటిని పాలకపక్షాలు ఎందుకు అమలు జరపడంలేదో ముందు నిగ్గు తేల్చాల్సిన విషయం. సమసమాజ నిర్మాణంలో ఆచరణలో అంతర్భాగం కావల్సిన ‘ఆదేశిక సూత్రాల’ను కాంగ్రెస్, బీజేపీ పాలకపక్షాలు ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదు. ఒక పార్టీ తన హయాంలో దేశం ‘అంతా వెలిగిపోతోంద’ని డబ్బా కొడితే, తాను ‘వికాస భారతాన్ని’ నిర్మిస్తున్నానని మరొక పార్టీ ‘డప్పు’ కొడుతూ ప్రజల్ని ఇంకా తప్పుదారి పట్టిస్తూనే ఉంది.
ఇదేనా దళితులకిచ్చే గౌరవం
అంతేగాదు. అంబేద్కర్ దళితులన్నా, అణగారిన ప్రజ లన్నా అన్ని మతాలలోని, మైనారిటీలలోని, మహిళల్లోని వర్గ, వర్ణ దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్న యావన్మందినీ - దళితులుగా నిర్వచించారు. నేటి బీజేపీ, ఇందుకు విరుద్ధంగా మైనారిటీల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది. నేటి గుజరాత్‌లో ఇంతవరకూ మోడీ హయాంలో ఒకే ఒక్క మైనారిటీ(ముస్లిం) అభ్యర్థి లోక్‌సభకు ఎన్నిక కావడం జరిగింది! ఈ రకమైన వివక్షకు అంబేద్కర్ పరమ వ్యతిరేకి అని మోడీకి తెలిసికూడా అంబేద్కర్ పేరును ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారు. ఉదాహరణకు గుజరాత్‌లో ఒక కేంద్రంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకుపోయి, అన్ని మతాల, కులాలవారు ప్రేమించిన చోటునుంచి మార్చి కేవలం దళితవాడలో ఒక మూల నెలకొల్పారు. అంతేకాదు మోడీ, ఆయన వర్గీయుల దళిత‘స్పృహ’కు ఆయన రాసిన ‘కర్మయోగ్’ పుస్తకమే ప్రబల నిదర్శనం. ఇందులో పేర్కొన్న అంశాలన్నీ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవే. తాను ‘దళితుడినని’ చెప్పుకునే మోడీలో దళిత‘స్పృహ’ కనపడకపోగా, అందులో అంతా ఎత్తిపొడుపులూ, అవహేళనలే ఉన్నాయి! ఆయన తన ‘కర్మ్‌యోగ్’ పుస్తకంలో దళితులైన సంప్రదాయ వాల్మీకి తెగలోని పారిశుద్ధ్య కార్మికుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు... ‘‘వాల్మీకులు తాము జీవనభృతిని నిలుపుకోవడం కోసం ఈ పాచి ఊడ్చే పనులు చేస్తున్నారు.
అలాకాకపోతే తరాలకొద్దీ ఈ వృత్తిలో కొనసాగేవారు కారు. కానీ కాలగమనంలో ఎవరికో జ్ఞానోదయం కలిగి, మొత్తం సమాజం సౌఖ్యం కోసం సంతోషం కోసం, దేవుడి తృప్తి కోసం వాల్మీకులు పాచిపనులు చేయడమే ధర్మం అని భావించారు! దైవాజ్ఞ ప్రకారమే తమకు సంక్రమించిన ఈ పారిశుద్ధ్యం పనులను వారు నెరవేర్చాలి. ఇది వారికి శతాబ్దాల తరబడి వస్తున్న ఆధ్యాత్మిక కార్యకలాపం. ఇది దైవాజ్ఞ కాకపోతే, వారి పూర్వీకులు మరో వృత్తినో, పనినో చేపట్టగల అవకాశం లేదని భావించడానికి వీల్లేదు’’!! దీన్ని బట్టి దళిత వాల్మీకుల పట్ల మోడీకి ఎంతటి ఘోరమైన దురవగాహన, చిన్నచూపు ఉందో అర్థమవుతుంది! గుజరాతీ సమాజాన్ని హిందుత్వ ప్రజావ్యతిరేక విధానం వైపు నెట్టిన మోడీ పుస్తకాన్ని గుజరాత్ ప్రభుత్వ పెట్రోలియం కార్పొరేషన్ ముద్రించడానికి సాహసించింది! గుజరాత్‌లో ‘లోకాయుక్త’ నియామకాన్ని పదేళ్లుగా అడ్డుకుంటున్నది దేని కి? పాలనలో అవినీతినీ, రాజ్యాధికార నిరంకుశ, అరాచక చర్యలనూ లోకాయుక్త విచారణ పరిధిలోకి రాకుం డా జాగ్రతపడేందుకే! గుజరాత్ ‘నమూనా అభివృద్ధి’ అంటే ఇప్పడు ‘అర్థమైంది’ గదా! ఒట్టి ‘ఊదర’అని!
చెరిగిపోని ‘చరిత్ర’
గుజరాత్‌లో 2002లో జరిగిన ముస్లింల ఊచకోతకు బాధ్యత వహించని ముఖ్యమంత్రి, క్షమాపణ వేడుకోని ప్రభుత్వాధినేత, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని మొరాయిస్తున్న వ్యక్తి, ఊచకోతల సందర్భంలో ‘రాజ ధర్మం తప్పావు’ ముఖ్యమంత్రి పదవికి తగవని నాటి ప్రధాని వాజపేయి హెచ్చరించినా వెరవని వ్యక్తి నరేంద్ర మోడీ! అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నిమిత్తం నియమించిన ‘సిట్’ తనను నిర్దోషిగా ప్రకటించినా, అదే కోర్టు ప్రత్యేక సహాయకుడిగా(ఎమికస్ క్యూరీ) నియమించిన న్యాయవాది రాజు రామచంద్రన్ ‘‘అయి నా, మోడీని విచారించడానికి తగిన సాక్ష్యం లేకపోలేదు’’ అని చాటినా వెరవని ఘనాపాఠే, గుజరాత్ ‘‘గెస్టెపో’’ దళాధిపతి మోడీ! చరిత్రను ఎవరూ మాపలేరు!
ఏబీకే ప్రసాద్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)