ఫిరాయింపు కాదు ఆశ్రయం
జాతిహితం
అది మంచైనా, చెడైనా నితీశ్‌ను ఫిరాయింపుదారు అనడం సరికాదు. పలాయనం చిత్త గించి బీజేపీని రాజకీయ ఆశ్రయం కోరడం అనాలి. తుది కంటా పోరుకు దిగితే అది ఏకపక్షంగానే ముగిసిపోతుందని గుర్తించగల వాస్తవిక దృష్టి ఆయనకుంది. కాబట్టి వలస పాలన కాలపు రాజాలా మారి, సొంత ప్రజలపై ఆధికారం నెరపడానికి బదులుగా సార్వభౌత్వాన్ని వదులుకోవడమే మెరుగు. ప్రతిపక్ష నేతలలో చాలా మంది ఆయనలాగే పలాయనమా, రాజకీయంగా కడతేరిపోవడమా? అనే సందిగ్ధాన్ని ఎదుర్కొంటారు.
నితీశ్ కుమార్, ఆయన పార్టీ మూకుమ్మడిగా ఒక రాజకీయ కూటమి నుంచి, భావజాలపరంగా దానికి పూర్తి విరుద్ధమైన మరో రాజకీయ కూటమికి ఫిరాయించడం తెలిసిందే. నరేంద్ర మోదీ, అమిత్‌షాలు 2019 ఎన్నికల విజ యాన్ని ఇప్పుడే ఖరారు చేసేసుకున్నారనే దీని అర్థమని విస్తృత జనాభిప్రాయం. మన బహిరంగ చర్చలోని స్వల్పకాలీనతకు ఇంతకంటే మెరుగైన ఉదాహరణ మరొకటి లేదు. దీనికి విరుద్ధంగా వాదించాలంటే మీకు నిర్లక్ష్యపూరితమైన దుస్సాహసమైనా ఉండాలి లేదా మీరు బిహార్‌లో అమ్మే దొంగ సారా తాగైనా ఉండాలి. ఈ మార్పు అంతరార్థాలు 2019 తర్వాత కూడా మిగులుతాయి.
భారత రాజకీయాల్లో, సమాజంలో, క్లుప్తంగా చెప్పాలంటే ప్రజాభిప్రాయంలోని మార్పునకు సంకేతం ఇలాగే ప్రస్ఫుటమౌతుంది. ఇందిరా గాంధీకంటే మరింత శక్తివంతమైన, విజయవంతమైన గొప్ప రాజకీయ నేత ఆవిర్భవించడమని కూడా దీని అర్థం. ఇందిర మరిన్ని ఎక్కువ రాష్ట్రాలను పాలిం చారు, మూడు సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గారు అంటూ అసమ్మతి తెలపడానికి దిగకండి. అప్పటికే అధికారంలో స్థిరపడి ఉన్న పార్టీ ఆమెకు వారసత్వంగా లభించింది. పైగా అప్పట్లో చెప్పుకోదగ్గ ప్రతిపక్షమూ లేదు. మోదీ ముఠాలుగా చీలి ఉన్న తన పార్టీలోని వ్యతిరేకులతోనేగాక, పెద్ద ఓటు బ్యాంకులున్న పలువురు భావజాల ప్రత్యర్థులతో కూడా పోరాడి గెలిచారు. ఇప్పుడు ఆయన, ఆయన పార్టీ అధ్యక్షుడు కలసి ఇందిర కంటే ఎక్కువ బలంగా పార్టీని తమ నియంత్రణలో ఉంచుకున్నారు. మీడియాలో చాలా భాగం నేడు సంతోషంగానే మోదీ పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, ప్రశంసలు కురిపిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసి తొమ్మిది నెలలు గడిచినా రద్దయిన కరెన్సీ ఎంతో ఆర్‌బీఐ ఎందుకు లెక్కకట్టలేకపోయిందనైనా కనీసం అడగలేని స్థితిలో అది ఉంది.
మన రాజకీయాల్లో కొత్త మలుపు
భారత క్రికెట్‌ను నడిపించడం కాక న్యాయవ్యవస్థ చేస్తున్నదేమైనా ఉందంటే అది.. యమునా నది ఒడ్డున మల విసర్జన చేసినందుకు రూ. 5,000 జరి మానా విధించడం, దేశభక్తి కొరవడిన మనలాంటి మూఢులకు జాతీయగీతం పట్ల గౌరవం చూపాలని బోధించడమే. క్రమశిక్షణ లోపించిన విశ్వవిద్యాలయం క్యాంపస్‌ను దారికి తేవడానికి తమకు ఒక యుద్ధ ట్యాంకును జ్ఞాపికగా ఇవ్వమని ఒక వైస్–ఛాన్స్‌లర్ కోరడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. మనం అదృష్టవంతులం, ఆయన మందుగుండు నింపిన నిజమైన యుద్ధ ట్యాంకునో లేదా పోలీసు సాయుధ శకటాన్నో అడిగారు కాదు. చర్చిల్ ఆలోచనా ధోరణితో రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం చివర్లో మనం చూస్తున్న వాస్తవాలను ఏకరువు పెట్టడమే ఇదంతా. రచయిత, ఓటు వేయడంలోని తన ఇష్టాయిష్టాలకు అతీతంగా రాజకీయ విశ్లేషణ సాగించాలి. అప్పుడే మనం ఈ మలుపును మంచిది లేదా చెడ్డది అని అభివర్ణించకుండా నిగ్రహం చూపుతాం. అయితే ఈ మలుపు, మన రాజకీయాలలో ప్రస్తుతం ఉన్న ప్రమేయాలు, సమీకరణాలన్నింటిని తీసి చెత్తబుట్టలో వేసేస్తోంది. కాబట్టి, మోదీ–షాల రాజకీయ కార్యక్రమం మూడేళ్లుగా అమలయ్యాక... నితీశ్ అనంతర కాలపు మన రాజకీయాలను చిత్రీకరిద్దాం.
మన దేశంలో ఇప్పుడు ఒక కొత్త రకం రాజకీయ సన్నివేశమూ, దానికి తగ్గ మానసిక స్థితి ఉన్నాయి. మన విలువలు, భావాలలో చాలా వరకు... ఏమంత మంచివి కానివి లేదా కాలంచెల్లినవి, వివేకం, నైతికత అనే భావనలు, అన్నిట్లోకీ ముఖ్యంగా భావజాలం.. నేడు మరణించాయి, దహన సంస్కా రాలూ జరిగిపోయాయి. మన ఓటర్లలో అత్యధికులు 21వ శతాబ్దపు తరంవారు. లౌకికవాద భావనకు ప్రామాణిక పరిరక్షకులుగా గుర్తింపుపొందిన వారిలో ప్రతి ఒక్కరూ అవినీతిగ్రస్తులు, వివాదాస్పదమైన వంశపారంపర్యవాదులు అయినప్పుడు, లౌకికవాదం సుగుణాల గురించి ఒప్పించడం కష్టం.
లేక వామపక్షాలు చెప్పే మతమేలేని కపటపు లౌకికవాదాన్ని చూద్దామంటే, ప్రపంచవ్యాప్తంగా వారి ఆర్థిక సిద్ధాంతాలు విఫలమయ్యాయి. విపత్కరమైన 26/11 ముంబై ఉగ్రదాడి గురించి మీ నేతలు ప్రశ్నలను లేవనెత్తుతున్నప్పుడు, ఉగ్రవాదులకు విధించిన మరణశిక్షలను సుప్రీం కోర్టు ధృవపరచినా గానీ, వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పడు, లేదా మీ సొంత ప్రభుత్వం కళ్ల ముందే జరిగిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్లో దేశంలోని అత్యున్నత సాహస పురస్కారాన్ని అందుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ మరణించినా దాన్ని బూటకపు ఎన్‌కౌంటర్ అంటున్నప్పుడు..సరళమైన జాతీయవాదాన్ని చెల్లుబాటయ్యేలా ప్రాచుర్యంలోకి తేవడం అసాధ్యం. మీకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉంది అని మీరు అనవచ్చు. అలా అయితే దాన్ని మీ పార్టీ నేత గురించి నిజం మాట్లాడటానికి కూడా ఉపయోగించండి.
రాజకీయ విజ్ఞతకు పునర్నిర్వచనం
జేఎన్‌యూకు వెళ్లే రహదారికి ఇప్పుడు సావర్కర్ లేదా గోల్వాల్కర్ పేరు పెడితే దానికి తెలిపే నిరసన ఎంత నమ్మించగలిగేదిగా ఉంటుంది? జామియా మిలియాలోని ఒక ఆడిటోరియంకు ఎడ్వర్డ్ సెడ్ పేరును, దానికి చేరే రహదారికి సెరా ఏ అర్జున్‌సింగ్ అని మీరు పేర్లు పెట్టారని గుర్తు తెచ్చుకోండి. లేదా మధ్యలోనే కాజేయగా మిగిలినవే ప్రజలకు చేరే, జనాకర్షకమైన, ఓట్లు రాబట్టే యోజనలలో చాలా వాటికి మీ పూర్వీకుల పేర్లు పెట్టి పేదలకు అనుకూలమైన పాలన అంటూ మీరు ప్రచారం చేసిన భావననే తీసుకోండి. మహాఘట్‌బంధన్ అనే ప్రహసనంగా జమకూడిన పార్టీలన్నీ చేసిన గొప్ప వాగ్దానమైన సామాజిక సమానత్వాన్నే తీసుకుని చూడండి. తమ సొంత చిన్న చిన్న వంశాలకు నాయకత్వం వహిస్తున్నవారిని మినహాయిస్తే. ఒక్క ముస్లిం, దళిత లేదా ఆదివాసీ నేతను కూడా ఎదగడాన్ని అవి అనుమతించలేదు. ఉదారవాదానికి కట్టుబడి ఉండే విషయానికి వస్తే... మీ సొంత భావనే అయిన ఆధార్‌పట్ల హాస్యాస్పదమైన వ్యతిరేకతగా అది కుదించుకుపోయింది.
భారత మానసిక స్థితిలో వచ్చిన మౌలిక మార్పునకు అంతరార్థం రాజ కీయ విజ్ఞతను, ఒకటి కాదు రెండు తరాల ఓటర్లు పునర్నిర్విచించారు. గతం, స్వాతంత్య్రోద్యమ రాజకీయాల్లో వేళ్లూనుకున్నది. అందువలన స్వీయనిరాకరణ, త్యాగం, అంతరాత్మ పిలుపునకు విధేయమై ఉండటం, అతిగా రాజకీయంగా సరైన వైఖరిని కలిగి ఉండటం వంటి వాటికన్నిటికీ నేడు కాలం చెల్లిపోయింది. నేడు చెల్లుబాటయ్యేది అధికారమూ, తప్పు అనే ఒప్పుకోలే లేకుండా ఆ అధికారాన్ని చెలాయించడమే. మోదీ రాజకీయ అర్హతల పత్రాన్ని చూస్తే, నేడున్న మరే రాజకీయ పోటీదారు కంటే ఆయనే ఆ పరీక్షలో నెగ్గారని చెబుతుంది. 2002 అల్లర్ల తర్వాత అటల్ బిహారీ వాజపేయి నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన రాజీనామా చేయలేదు, మరెవరినీ రాజీనామా చేయమని కోరలేదు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాలను ఉదాసీనంగా విస్మరిం చారు. స్మృతి ఇరానీని తక్కువ ముఖ్యమైన శాఖకు పంపి ఉండొచ్చుగానీ, ఆమెకు పునరావాసం కల్పించే పని జరుగుతోంది. ఆయన వైఖరి గురించి మరిన్ని ఆధారాలు కావాలా? ఆయన తన ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిన దాదాపు డజను మందిలో ఎవరినీ పదవి నుంచి తొలగించలేదు. అందరి కంటే ఎక్కువ అప్రతిష్ట తెచ్చిన సీబీఎఫ్‌సీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీని సైతం పదవిలో కొనసాగించారు.
నితీశ్ బాటన సాగాల్సిందేనా?
2014 ఎన్నికలపై నేను మొదట చేసిన వ్యాఖ్యలో నూతన భారత ఓటరు నేడు భావజాలానంతర, నేను నీకేమీ రుణపడి లేను అనే మనస్తత్వంతో ఉన్నాడని అన్నాను. బీజేపీ విజయపరంపర కొనసాగుతున్నదీ అంటే భారత లౌకికవాదం, ఉదారవాదం అంతరించిపోయాయని కాదు. కాకపోతే బీజేపీ విజ యాలు మనం ఇంతకు ముందు ఆ భావనలలో మనకు ఉన్నదనుకున్న విశ్వాసం ఎంత లోతైనదనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అతి ఎంతో లోతేనది కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల ఓటర్లలోని పెద్ద మెజారిటీ తాము ఎప్పుడూ విశ్వసిస్తూనే ఉన్న వాటి గురించి, పాత తరానికి చెందిన నైతికత, రాజీయంగా సరైన వైఖరి లేదా కపటత్వాల కారణంగా బయటకు మాట్లాడలేకపోయారు. వారిప్పుడు తాము విశ్వసిస్తున్నదానికి సమంజసత్వాన్ని చూస్తున్నారు. నూతన భారతం మోస్తున్న ఆ పాత తల బరువును మోదీ–షాల బీజేపీ వదిలించేసింది. భారతీయులు దాన్ని మెచ్చుతున్నారు.
ఇప్పటికైతే, ఏ ప్రతిపక్ష నేతా లేదా కూటమి దీన్ని ఎదిరించలేదు. కాంగ్రెస్ లెక్కలోకి రానిదిగా కుదించుకుపోయింది. కర్ణాటకలో అధికారం కోల్పోతే అది దాదాపుగా చనిపోయినట్టే అవుతుంది. పంజాబ్‌లోని అమరిందర్ సింగ్ అప్పుడిక నితీశ్‌లా సందిగ్ధంలో పడతారు. లేదంటే కేంద్రం ఆయనను ఆకట్టుకుంటుంది లేదా ఒత్తిడి చేస్తుంది. మరోవంక కాంగ్రెస్ అధిష్టానం జోక్యం, అనుమానాలతో ఆయన వ్యవహరించాల్సి వస్తుంది. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు కొంత కాలం పాటు గట్టిగా నిలవగలుగుతారే తప్ప, బలీయమైన బీజేపీని దూరంగా ఉండేలా నిలవరించ లేరు. కేరళకు ఇంకా కొంత సమయం పడుతుంది గానీ, కాంగ్రెస్ అక్కడ బీజేపీకి తన స్థానాన్ని కొంతవరకు వదులుకోవాల్సి వస్తుంది.
అది మంచైనా లేదా చెడైనాగానీ, నితీశ్‌ను ఫిరాయింపుదారు అనడం సరికాదు. దాన్ని బీజేపీ చెంతకు పలాయనం చిత్తగించడం అనాలి. తట్టాబుట్టా సర్దుకుని విమానంలో తప్పించుకు పారిపోయి బీజేపీని ఆశ్రయం కోరడంగా అభివర్ణించాలి. తుదికంటా పోరుకు దిగితే అది ఏకపక్షంగానే ముగిసిపోగలదని, అది నిరర్థకమని గుర్తించేపాటి వాస్తవికవాద దృష్టి ఆయనకుంది. తన ముందున్నది, ‘నేనే మొదట, నేనూ, నా సెల్ఫీ’ అనే వ్యామోహంతో ఉన్న మారిన ఓటర్ అని గుర్తించడానికి తగినంత కాలం నితీశ్ రాజకీయాల్లో మనగలిగారు. ఆయన ఇంతవరకు ఉపయోగించిన నినాదాలు, ప్రత్యేకించి సామ్యవాదం, లౌకికవాదాలకు జనసమ్మోహక శక్తి లేదు. ఆయన వద్ద సరి కొత్త భావాలూ లేవు. అందువల్ల వలసకాలపు భారత రాజాలాగా మారి, తన సొంత ప్రజలపై ఆధికారం నెరపడానికి బదులుగా సార్వభౌమత్వాన్ని వదులుకోవడమే మెరుగు. ఎంతోకాలం కాక ముందే, మిగతా ప్రతిపక్ష నేతలలో చాలా మంది... పార్టీ వీడటమా లేక అంతరించిపోవడమా అనే సందిగ్ధాన్ని ఎదుర్కొంటారు. లేదంటే మీకు గనుక ఊహాత్మకత ఉంటే చలామణీ చేయగలగిన ప్రభావశీలమైన కొత్త నినాదాన్ని కనిపెట్టాలి.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta