
ప్రతిష్టంభన వెనుక ప్రతీకారేచ్ఛ
సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మాణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు.
పార్లమెంటు లోపలా, బయటా సాగుతున్న పెనుగులాటలో గెలిచేది ఎవరో తెలియదు కానీ ఓడేది మాత్రం ప్రజలే. వానాకాల సమావేశాలు ప్రతీకార రాజ కీయాల వెల్లువలో కొట్టుకుపోయినట్టే లెక్క. యూపీఏ హయాంలో ప్రతిపక్ష బీజేపీ ఏ విధంగా చర్చకు అంతరాయం కలిగించిందో అదే విధంగా ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ పాలనలో సర్వోన్నత చట్టసభలో చర్చ చట్టుబండలు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నది. ‘తానాషాహీ నహీ చెలేగీ’ (నియంతృత్వం సాగదు) అంటూ పార్లమెంటు భవనం బయట కాం గ్రెస్ అధినేత సోనియాగాంధీ నినాదాలు చేయడం, ఒకవైపు రాహుల్‌గాంధీ, మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా చెలరేగడం వెనుక పాతకక్ష లేకపోలేదు. యూపీఏ హయాంలో బీజేపీ సృష్టించిన ప్రతిష్టంభనకు మాత్రమే ప్రతీకారం కాదు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు సంభవించిన నాటకీయ పరిణామాలలో ప్రధాని పదవికీ, సోనియాగాంధీకీ మధ్య నిలిచిన నాటి ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్‌పైన ఇది కక్షసాధింపు.
సుష్మాపైనే ఎందుకు గురి?
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పదవుల నుంచి వైదొలిగే వరకూ పార్లమెంటులో చర్చ జరగబోదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ ముగ్గురిలో తక్కువ తీవ్రత ఉన్నది సుష్మాస్వరాజ్‌పైన వచ్చిన ఆరోపణలలోనే. ఐపీఎల్ క్రికెట్ సృష్టికర్త లలిత్‌మోదీకీ, వసుంధర రాజే కుమారుడికీ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో 35మందికి పైగా వ్యక్తులు మరణించినట్టు రుజువులు ఉన్నాయి. లలిత్‌మోదీ పోర్చుగల్ వెళ్ళడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిస్తే దాని వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేదని పూచీ ఇవ్వడం సుష్మాస్వరాజ్ చేసిన తప్పిదం.
ఈ విషయం మంత్రివర్గంలోని ఇతర బాధ్యులకు తెలియకుండా గోప్యంగా జరగడం నిశ్చయంగా అసాధార ణమే. అక్రమమే. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలలోని తీవ్రత సుష్మాపైన చేస్తున్న ఆరోపణలలో లేదు. గురి సుష్మాపైనే ఎందుకు పెట్టారు? 2004లో ఎన్నికలైన తర్వాత తన నాయకత్వంలోని కూటమికి లోక్ సభలో సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సభ్యుల మద్దతు ఉన్నదంటూ అబ్దుల్ కలాంను కలుసుకునేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళిన సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత త్యాగం సీనుకు తెరలేపారు. తాను స్వయంగా ప్రధాన మంత్రి పదవిని స్వీకరించకుండా మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌ను గద్దెపైన కూర్చోబెడుతున్నట్టు ప్రకటించారు.
దీనికి నేపథ్యం ఏమిటో చాలా మందికి తెలుసు. ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీని కనుక ప్రధానిగా నియ మిస్తే తాను శిరోముండనం చేయించుకొని, తెల్లచీర కట్టుకొని జన్‌పథ్‌లో నిరా హార దీక్ష చేస్తానంటూ సుష్మాస్వరాజ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి ఆగ్రహం సొనియాగాంధీ హృదయంలో రగులుతూనే ఉంది. ఇప్పుడు సుష్మాను బోనె క్కించే అవకాశం వచ్చింది. పోర్చుగల్ ప్రయాణానికి అవసరమైన పత్రాలు లలిత్ మోదీకి అందేందుకు దోహదం చేయడమే కాకుండా సుష్మా భర్త, కుమార్తె క్రికెట్ మాయావికి న్యాయసలహాదారులుగా ఉండటం కాంగ్రెస్ దాడికి పదును పెట్టింది. ‘లలిత్‌మోదీ సుష్మా భర్తకూ, కుమార్తెకూ ఎంత చెల్లించారో వెల్లడిం చాలి’ అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.
రాటుదేలుతున్న రాహుల్
కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీఇరానీ సవాలు చేసినట్టు ఒకటిన్నర నిమి షం మాత్రమే కాకుండా గంటన్నర సేపు మాట్లాడటం సోనియాకు కానీ రాహు ల్‌కి కానీ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చును కానీ, కొన్ని ఘాటైన మాటల (పంచ్ లైన్ల)తో మోదీని వేధించడంలో రాహుల్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ‘ న ఖావూంగా, న ఖానేదూంగా’ (తినను, తిననివ్వను) అంటూ చేసిన వాగ్దానాన్ని పదేపదే ఉటంకించడం ద్వారా అవినీతి వ్యవస్థకు మోదీ అధ్యక్షత వహిస్తున్నారనే భావనను రాహుల్ జయప్రదంగా ప్రచారంలో పెట్టగలిగారు.
మోదీకి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కార ణాలు ప్రధానంగా మూడు. ఒకటి, మోదీ అవినీతికి ఆమడ దూరం. రెండు, మోదీ సమర్థ పాలకుడు. మూడు, అభివృద్ధి సాధకుడు. రాహుల్ సుదీర్ఘ విరా మం ముగించుకొని వస్తూనే మోదీ ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్ కీ సర్కార్’ అంటూ దుయ్యపట్టారు. పేదలకు వ్యతిరేకిగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలు డుగా అభివర్ణించారు. ‘అటు అంబానీ, ఇటు అదానీ, మధ్య ప్రధాని’ అంటూ తెలుగులో సైతం చలోక్తులు వినిపించాయి. ఈ మచ్చ మాపుకోవడం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారు. కొర్పొరేట్ రంగ ప్రతినిధులను కలుసుకోవడానికి సైతం సంకోచిస్తున్నారు. అందుకే ‘ఇది మోదీ ప్రభుత్వం కాదు’ అంటూ బజాజ్ ఆటో అధిపతి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ లాగా రాహుల్ బజాజ్ రాజకీయవాది కాదు. పైగా మోదీ అభిమాని. మోదీ తన ప్రత్యే కతలనూ, స్వశక్తిని విస్మరించి పేదలకు వ్యతిరేకి కాదనే పేరు తెచ్చుకునే ప్రయ త్నంలో గట్టి పనులు చేయలేకపోతున్నారని బజాజ్ ఫిర్యాదు.
పారిశ్రామికవేత్తలతో, వణిక్‌ప్రముఖులతో సమాలోచనలు జరిపి పరిశ్రమ లనూ, వ్యాపారాన్నీ విస్తరించడం ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించాలనీ, నిరు ద్యోగాన్ని తగ్గించాలనీ మోదీ అభిమానులు కోరుకుంటున్నారు. వెనకటి నుంచి పన్ను కట్టించుకునే చట్టాన్ని (రెట్రాస్పెక్టివ్ టాక్స్ లా) ఉపసంహరించుకోవా లనీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ)చట్టాన్ని తీసుకురావాలనీ అభిల షిస్తున్నారు. మోదీ మరింత సమర్థంగా, శక్తిమంతంగా పరిపాలన నిర్వహిం చాలనీ, శషభిషలు లేకుండా బాణంలాగా దూసుకుపోవాలనీ 2014లో అరు దైన అవకాశం ప్రసాదించిన దేశప్రజలు కోరుకుంటున్నారు.
కొన్ని అరుదైన విజయాలు
ప్రధానిగా మోదీ సాధించిన విజయాలు లేకపోలేదు. గత ప్రభుత్వాలు ఆరం భించిన కొన్ని విధానాలను కొనసాగించడమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ బలంగా ముందుకు తీసుకొని వెడుతున్నారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పం దం చరిత్రాత్మకమైనది. 1974లో ఇందిరాగాంధీ, ముజీబుర్ రెహ్మాన్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని, బీజేపీ దశాబ్దాలుగా వ్యతిరేకిస్తూ వచ్చిన నిర్ణయాన్ని మోదీ అమలులోకి తేగలిగారు. ముయ్‌వావర్గంతో ఇటీవల కుదుర్చుకున్న శాంతి ఒప్పందం నాగభూమిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి దోహదం చేస్తుంది. దౌత్యరంగంలో భారత్‌కు గుర్తింపు సాధించడంలో మోదీ కృషి కొంత వరకూ ఫలించింది. పార్లమెంటులో ప్రతిష్టంభన కారణంగానూ, తన పార్టీలోని ప్రముఖులపైన అవినీతి ఆరోపణలు వచ్చిన కారణంగానూ మోదీ మౌనం వహించడం ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన నాయకుడుగా, ప్రజలతో నేరుగా సంభాషించే నేర్పు కలిగిన రాజకీయవేత్తగా పేరున్న మోదీ స్వపక్షీయులపైన వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టలేక, ఒప్పుకో లేక మౌనాన్ని ఆశ్రయించడం బలహీనతగానే ప్రజలకు అనిపించింది.
ఎన్నికల సమయంలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అనేకం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపైన చర్చ సందర్భంగా సీనియర్ బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపైన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ సమస్య క్రమంగా రగులుతోంది. శనివారంనాడు తిరుపతిలో ఒక యువకుడు ఆత్మ హత్యాయత్నం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 సార్వత్రిక ఎన్నికలలో గెలిపించడానికి రెండు వాగ్దానాలు కారణం. ఒకటి, రైతుల రుణ మాఫీ. రెండు, ప్రత్యేక హోదా. రెండూ ఆచరణకు నోచుకోలేదు. ఈ వైఫల్యానికి తెలుగుదేశం ఎంత కారణమో బీజేపీ సైతం అంతే కారణం.
చర్చ ఎవరికి కావాలి?
పార్లమెంటులో చర్చను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక కార ణం అంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీతో సమాలోచనలు జరిపి ఆ పార్టీ సహకారం పొందడానికి నరేంద్రమోదీ ఎందుకు ప్రయత్నించలేదు? పార్లమెంటులో చర్చ జరగకుండా సమయం వృధా అవుతున్నా నిమ్మకు నీరె త్తినట్టు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? గులాం నబీ ఆజాద్‌నూ, మల్లికార్జున్ ఖార్గేనూ బీజేపీ నాయ కులు సంప్రతించారు. చర్చను అడ్డుకోవాలన్నదే తమకు అధిష్ఠానం నుంచి అం దిన ఆదేశమని వారు చెప్పడంతో బీజేపీ నాయకులు అంతటితో వదిలివేశారు. మోదీ స్వయంగా చొరవ తీసుకొని సోనియాగాంధీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
మరో సంవత్సరంపాటు రాజ్యసభలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగు తుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68. ఎన్‌డీఏకి 64 మంది ఉన్నారు(బీజేపీకి 48 మంది, మిత్రపక్షాలకు 16). 2016లో మొత్తం 76 మంది సభ్యుల పదవీ విరమణ ఉంటుంది. వారిలో 21 మంది కాంగ్రెస్‌కు చెందినవారు. వీరిలో అత్యధికులు రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి కాంగ్రెసేతర రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారు. సగం సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కవు. పదవీ విరమణ చేయనున్న 17 మంది బీజేపీ సభ్యులు, ఏడుగురు మిత్రపక్షాల సభ్యుల స్థానంలో ఆ పార్టీలకి చెందినవారే ఖాయంగా ఎన్నికై సభకు తిరిగి వస్తారు. 2016 మార్చిలో 12 మంది నామి నేటెడ్ సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
సాధారణంగా అధికార కూటమి సూచించినవారినే రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కనుక వారు బీజేపీకి అను కూలురే ఉంటారు. పరిస్థితులు అనుకూలించే వరకూ వేచి ఉండాలని మోదీ నిర్ణయించుకొని ఉంటారు. ప్రస్తుతానికి బిహార్ ఎన్నికలపైనే బీజేపీ దృష్టి నిలిపింది. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటే ముందు బిహార్‌కు ఆ వరం మోదీ ప్రసాదించేవారు. 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లతో పని లేదు. బిహార్ తర్వాత కేరళ, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరు గుతాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరుణ్ గగోయ్‌కి అస్సాంలో వ్యతిరేకత ప్రబలంగా ఉంది.
1985 నుంచి కేరళలో అధికారంలో ఉన్న కూటమిని గెలిపించే ఆనవాయితీ లేదు. అక్కడ బీజేపీ విజయం సాధించ లేకపోయినా కాంగ్రెస్ ఓడిపోతుంది. రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణించే వరకూ ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం సాధ్యం కాదని మోదీ గ్రహించి ఉంటారు. ఆర్థిక సంస్కరణల కంటే, ప్రజాహితం కంటే ప్రతీకార రాజ కీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా మోదీ చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పట్టువిడుపులు లేని వైఖరి అవలంబించడానికి బీజేపీ గత లోక్‌సభలో అనుసరించిన అనుచిత ధోరణే కారణం. నాడు అడ్డుకున్న జీఎస్‌టీ బిల్లును ఇప్పుడు సభ చేత ఆమోదింప జేయాలని ప్రయత్నించడం కపట రాజ కీయాలకు నిదర్శనం.
సభలో చర్చ జరగనీయకుండా ప్రతిష్టంభన సృష్టించడం ప్రజాస్వామ్య విధానంలో భాగమేనంటూ అప్పుడు ప్రకటించిన అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు ఇప్పుడు అందుకు భిన్నంగా వాదిస్తే ఎవరు ఆలకిస్తారు? ఈ సమావేశాలలో మాత్రమే కాదు వచ్చే శీతాకాల సమావేశాలలో కూడా నిర్మా ణాత్మకమైన చర్చ జరిగే అవకాశం లేదు. సవాలక్ష సమస్యలతో ప్రజలు సత మతం అవుతున్నారు. రాజకీయ నాయకులకు వారి పట్టుదలలే ప్రధానం. వారి ప్రయోజనాలకే ప్రాముఖ్యం. దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదు. సామరస్య వాతావరణానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. పదవీ రాజకీయాల పతనావస్థకు మనం ప్రత్యక్ష సాక్షులం.
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్
- కె.రామచంద్రమూర్తి