ప్రకటనలతో పవనాలు వీచేనా! | TDP situation in two states | Sakshi
Sakshi News home page

ప్రకటనలతో పవనాలు వీచేనా!

Published Wed, Jan 21 2015 2:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

దేవులపల్లి అమర్‌ - Sakshi

దేవులపల్లి అమర్‌

 డేట్‌లైన్ హైదరాబాద్
  చంద్రబాబునాయుడు కొంతకాలంగా తమది జాతీయ పార్టీ అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలయినందున, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నికయిన  ప్రజా ప్రతినిధులు ఉన్నందున సాంకేతికంగా మాది జాతీయ పార్టీ అని ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పరిస్థితులలో ఉందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో  లుకలుకలు అంత తొందరగా బయటపడకపోవచ్చు.
 
 ప్రఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వ హించాలని తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు జనవరి 18న, అంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ దయాకర్‌రావు ప్రభుత్వాన్ని ఈ కోరిక కోరారు. ఆ మరునాడే తెలంగాణ జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలనూ, కిందిస్థాయి నాయకులనూ ఉత్సాహపరచాలని పార్టీ అధినేత, పక్క రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడును దయాకర్‌రావుతో పాటు అదే పార్టీకి చెందిన ఇతరులు కూడా కోరారని వార్తలు వచ్చాయి. చంద్రబాబునాయుడు కూడా ఈ కార్యక్రమానికి ‘సరే’న న్నారట. ఫిబ్రవరి నుంచి నెలకు రెండు మూడు జిల్లాల చొప్పున చంద్రబాబు తెలంగాణలో పర్యటించి పార్టీ శ్రేణులకూ, నాయకులకూ దిశా నిర్దేశం చేస్తారని దయాకర్‌రావు, ఎల్. రమణ చెప్పారు కూడా.

 ఏమి ఆశించి కోరుతున్నారు?
 ఈ దేశ పౌరసత్వం కలిగిన వారు ఎవరైనా సరే ఒక్క తెలంగాణ  అని ఏమిటి? దేశంలోని ఏ రాష్ర్టంలోనైనా పర్యటించవచ్చు, ప్రజలను కలుసుకోవచ్చు, రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు, పోటీ చెయ్యవచ్చు. ప్రజలు గెలి పిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పరిపాలన కూడా సాగించవచ్చు. ఒక్క జమ్మూ కశ్మీర్ మాత్రం దీనికి మినహాయింపు. కాబట్టి చంద్రబాబునాయుడి తెలంగాణ రాష్ర్ట పర్యటనను ఎవరూ అడ్డుకోనవసరంలేదు. అభ్యంతర పెట్ట డం కుదరదు కూడా. ఇక ఎన్.టి. రామారావు జయంతి, వర్ధంతి అధికారి కంగా జరపాలన్న డిమాండ్ విషయానికి వస్తే- ఎన్‌టీఆర్ ఒక అద్భుత నటుడు. కొన్ని మంచి ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో రాజ కీయాలలోకి వచ్చి, అనేక మలుపుల మధ్య అర్ధంతరంగా నిష్ర్కమించారు. కాబట్టి ఆయన పేరు మీద ఉత్సవాలు నిర్వహించమని కోరడంలో తప్పు లేదు. కానీ దయాకర్‌రావు ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో, ఎవరిని ఈ కోరిక కోరుతున్నారో ఒక్కసారి పరిశీలిస్తే ఇదంతా హాస్యాస్పదమనిపిస్తుంది. ఏ పరిస్థితులలో తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందో ఆయనకు బాగా తెలుసు. సమైక్యవాది అయిన ఎన్.టి. రామారావు జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపదనీ బాగా తెలుసు. మరి ఏమి ఆశించి ఆయన ఈ ప్రకటన చేసినట్టు? ఇంత రాజకీయ అనుభవం కలిగిన దయా కర్‌రావు పరిస్థితి ఏమిటి అని ఎవరైనా అనుమానించే అవకాశం అయితే కచ్చితంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏది డిమాండ్ చెయ్యాలో తెలి యని అగమ్యగోచర స్థితిలో పడిపోయి దయాకర్‌రావు ఎన్టీఆర్ పేరిట అధికా రికంగా వేడుకలు జరపండని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతు న్నారనుకోవాలా?

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కొన్ని దశాబ్దాలుగా శాసన సభకు వరుసగా ఎన్నికవుతున్న, ప్రజాదరణ కలిగిన నాయకుడని పేరు కలి గిన దయాకర్‌రావు మానసికస్థితి తెలంగాణ రాష్ర్టంలో ఆయన పార్టీ ఉన్న స్థితికి అద్దం పట్టేలా ఉంది. వర్ణించడానికి వీల్ల్లేనంత గందరగోళంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ, దాని నాయకులూ ఉన్నారన్నది స్పష్టం. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొంతకాలంగా తమది జాతీయ పార్టీ అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలయినందున, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ఉన్నందున సాంకే తికంగా మాది జాతీయ పార్టీ అని ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పరిస్థితులలో ఉందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు అంత తొందరగా బయటపడకపోవచ్చు. అక్కడ ఒక కోటరీ అధినాయకుడి చుట్టూ చేరి, ఇతరులెవరినీ, చివరికి సీనియర్ నాయకులు, మంత్రులను కూడా ముఖ్యమంత్రికి దూరంగా పెడుతున్నందుకు అసంతృప్తి అప్పుడే రాజుకుం టున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయం ఇంకోసారి మాట్లాడుకుందాం. తెలంగాణ విషయానికే వద్దాం.

 కంటోన్మెంట్ పాఠం
 కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో రాయి ఏరబోయిందన్న సామెతను గుర్తుకు తెస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఏడు మాసాలలో అధికారంలో ఉండి ఏమేమి పనులు చెయ్యగలిగారో వారికే అర్ధం కాదు. కానీ తెలంగాణ లో ఇప్పటి వరకు పర్యటించకపోవడానికి కారణం కొత్త ప్రభుత్వానికి ఆరు మాసాలయినా సమయం ఇవ్వాలన్న సంయమన ధోరణేనట.

 మొన్ననే జంటనగరాలలో కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి. నిజానికి చాలా చిన్న ఎన్నికలు ఇవి. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నంత పెద్ద ఎన్నికలేమీ కావు. ఎనిమిది డివిజన్‌లు, లక్షన్నర మంది ఓటర్ల్లు ఉన్న చిన్న బోర్డు. అందునా 40 శాతానికి మించి ఓట్లు పోల్ కాలేదు కూడా. రెండు స్థానాలలో తిరుగుబాటు అభ్యర్థులు గెలిస్తే వాళ్లను కూడా తమ ఖాతాలో వేసుకుని ఆరు మేమే గెలిచాం, కాబట్టి భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మాకు ఢోకా లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతోషపడిపోతున్నారు. అయితే అవి పూర్తిగా నగర ప్రాంతంలో జరిగిన ఎన్నికలు. 2014 ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం గెలిచినా 15 స్థానాలలో పది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాగా, మిగిలిన అయిదు మాత్రం నాలుగు జిల్లాల నుంచి గెలిచారు. తెలంగాణలో అయిదు జిల్లాలలో తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికలలో బోణీ కూడా చెయ్య లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ లో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో కలసి పోటీ చేసినా ఆ పార్టీ అడ్రస్ లేకుండాపోయిన ఈ చిన్న కంటోన్మెంట్ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ.

 నానాటికీ తీసికట్టు
 తెలంగాణ శాసనసభలో 119 స్థానాలకుగాను (బీజేపీతో పొత్తు పెట్టుకున్నా) 15 స్థానాలు మాత్రమే గెలిచిన తెలుగుదేశం వాటిని కూడా నిలబెట్టుకోలేని స్థితిని మనం చూస్త్తూనే ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ముగ్గురు శాసన సభ్యులు ఆ పార్టీని విడిచి, అధికార పార్టీకి వలసపోయారు. సంఖ్య పన్నెండుకు తగ్గింది. ఆ ముగ్గురు శాసనసభ్యులు వలసపోయిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. వేరొక పార్టీ నుంచి గెలిచారు కాబట్టి శాసన సభ్యత్వాలకు రాజీనామాలు ఆమోదింపచేసుకుని అధికార పార్టీలో చేరితే అంతా హర్షించేవారు. వారిని ఆ విషయంలో నిలదీసే స్థితిలో తెలుగుదేశం అధినాయకత్వం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న పనీ అదే. కాబట్టి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ! అంటారన్న వెరపు. అధికార పార్టీలోకి వలసపోయిన ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ చేత ఆమో దింపచేసేందుకు ఒత్తిడి పెంచే పని మరిచిపోయి, దయాకర్‌రావు ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి అధికారికంగా జరపాలని తెలంగాణలో డిమాండ్ చెయ్య డం హాస్యాస్పదం.

 శాసనసభా పక్షమైనా మిగిలేనా!
 ఇప్పుడు ఇంకో అయిదుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తాజా సమాచారం. తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం రోజురోజుకూ ఖాళీ అవుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. చంద్రబాబునాయుడు పర్యటనలతోనో, లోకేశ్ బాబు ప్రవచనాలతోనో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ర్టంలో ప్రజా సమ స్యల మీద పోరాటం చెయ్యగల సమర్థ నాయకత్వం ఎదిగి, ఆ నాయకత్వం మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరం డాలో పడిగాపులు పడే అవస్థ నుంచి తప్పించుకుంటేనే అది సాధ్యం. తెలంగాణ శాసన సభాపక్షాన్ని ఖాళీ చేసే పనిలో పడ్డ అధికార పార్టీ జోరుకు అడ్డుకట్ట వేసే స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం ఉన్న సూచనలేమీ కనపడటం లేదు.
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement