చావుతప్పినా తోవ మారని కాంగ్రెస్ | Tovah eternal death unless Congress | Sakshi
Sakshi News home page

చావుతప్పినా తోవ మారని కాంగ్రెస్

Published Tue, Feb 10 2015 12:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

దేవులపల్లి అమర్ - Sakshi

దేవులపల్లి అమర్

ప్రతిపక్షమే లేదన్నట్టు వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉన్న వాటిని ఖతం చేసే కార్యక్రమాన్ని ఎంచుకున్న తెలంగాణ  ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తే సరిపోదు. కాంగ్రెస్‌కు ఇక్కడా అక్కడా కూడా బీజేపీ తోనూ, టీడీపీతోనూ పొసగదు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌నీ, వామపక్షాలనూ కలుపుకొని నడవనంత వరకు ఎన్ని కోట్ల సంతకాలు సేకరించినా, ఎన్ని చలో రాజభవన్‌లు నడిపినా ప్రయోజనం ఉండదు.
 
డేట్‌లైన్ హైదరాబాద్
 
కాంగ్రెస్ పార్టీ గురించి మహాకవి శ్రీశ్రీ ఒకచోట రాసిన పంక్తులు గుర్తొ చ్చాయి- రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ వారం రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తుంటే. పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట తిరిగి పుంజుకునేదెప్పుడు... ఫలానా అప్పుడు, ఫలానా అప్పుడు అని అస్సలు సాధ్యం కాని విషయాలను గురించి ఆ పద్యంలో చెపుతాడు మహాకవి. ఒక సందర్భంలో కాంగ్రెస్ పరిస్థితి మీద శ్రీశ్రీ రాసిన కవిత అది. అయితే తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు ఆ పూర్వ వైభవం పలుమార్లు వచ్చింది. పోయింది కూడా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఆనాడు మహాకవి రాసినట్టే ఉంది, కనుకనే ఈ ప్రస్తావన. ఆ రోజుల్లో, అదీ మహాకవి శ్రీశ్రీ కాబట్టి ఏం రాసినా, అందులో ఎలాంటి భాష వాడినా చెల్లింది. కాని ఇప్పుడు వాటిని తిరిగి ఇక్కడ రాయ డం సభ్యత కాదని భావించడం వల్లనే ఆ పద్యం పూరించలేకపోతున్నాను.
 
అది ప్రతిపక్షం కర్తవ్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రెండు ప్రభుత్వాల మీదా ఇక పోరాటం మొదలుపెట్టాలని తీర్మానించుకుని తొలి దశ ఉద్య మాన్ని మొన్న ప్రకటించాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అయినప్పుడు వాటిని వ్యతిరేకించి పోరాడాల్సిన బాధ్యత ప్రతి పక్షాలదే. చట్టసభల్లోనూ, వాటి వెలుపలా ఈ పోరాటాలు జరగాలి. అయిన దానికీ, కానిదానికీ ప్రభుత్వాలను విమర్శించడం వాటి మీద విరుచుకు పడటం కాకుండా, ఎక్కడైతే ప్రజలకు నష్టం జరుగుతున్నదో, ఎక్కడైతే ప్రజా ధనం దుర్వినియోగం అవబోతున్నదో అక్కడ ఏ మినహాయింపులూ, వెనకకు తగ్గడాలూ లేకుండా ప్రతిపక్షాలు పోరాడవలసిందే. అన్ని వేళలా అన్ని సమ స్యల మీద ప్రజలే స్వయంగా వచ్చి ఉద్యమాలు చేయరు. ఆ పని చెయ్యాల్సింది ప్రతిపక్షాలే.
 
మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాలను గురించి మాట్లాడుకున్న ప్పుడు శాసన వ్యవస్థలో ప్రాతినిధ్యం దృష్ట్యా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక్కటే ప్రతిపక్షం. తెలంగాణ  చట్టసభలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, మజ్లిస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బీజేపీకి కొద్దిపాటి ప్రాతినిధ్యం ఉన్నా, మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం మాత్రం ఈ అయిదు సంవత్సరాల్లో లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన తీరు ప్రజా స్వామ్య బద్ధంగా లేకపోయినా, ఆ రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతల పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నా, అక్కడి బీజేపీ నాయకుల చేతులు అధికార పగ్గాలతో కట్టేసినట్టే అయింది. మిత్రధర్మం అనండీ, సంకీర్ణ ధర్మం అనండీ!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నోరు విప్పి మాట్లాడే స్థితిలో ఇవాళ లేదు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. నిజానికి రాష్ర్ట విభజన చేసింది కాంగ్రెస్ అయినా, బీజేపీ నిలబడకపోతే, గట్టిగా సమర్థించకపోతే తెలంగాణ రాష్ర్టం ఏర్పడేది కాదు. ‘చిన్నమ్మను, నన్నూ గుర్తుపెట్టుకోండి!’ అని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అభ్యర్థించినా చెలిమికి సిద్ధపడని టీఆర్‌ఎస్ సిద్ధపడలేదు. ఆ వైఖరితోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పట్ల బీజేపీకి ఉన్న మొహమాటాలు, తెలంగాణ విషయంలో లేకుండా చేశాయి. పైగా తనకు బద్ధ శత్రువైన మజ్లిస్‌కు అధికార పార్టీ అందిస్తున్న స్నేహహస్తం కూడా బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్‌లో లేని రాజకీయ అవకాశాలను ఇచ్చింది.
 
తెలంగాణలో మెత్తబడుతున్న కమలం?

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారతీయ జనతా పార్టీ రాష్ర్ట ప్రభుత్వం మీద కొంత విమర్శనాత్మకంగా వ్యవహరించినా, రాను రాను ఆ పార్టీ వైఖరిలో అధికార పక్షం పట్ల కొంత మార్పు వస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ నుంచి కొత్తగా వెలువడుతున్న దినపత్రికకు ఆది వారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం స్పష్టం చేసినట్టే కనిపించింది. ‘ప్రభుత్వాన్ని తొందరపడి విమర్శించం!’ అన్నారు కిషన్‌రెడ్డి. ఎవరైనా చెయ్యాల్సింది అదే. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ప్రతిపక్షం, అందునా కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ వంటి పార్టీ బాధ్యతగా వ్యవహరించవలసిందే. కానీ అదే ఇంటర్వ్యూలో బీజేపీ అధ్యక్షుడు మరోమాట కూడా అన్నారు, ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌వి మంచి నిర్ణయాలే’ అని. 2019లో స్వతంత్రంగా పోరాడి గెలవడం తమ పార్టీ లక్ష్యం అని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. అంటే ఈ అయిదు సంవత్సరాలూ బీజేపీ శక్తియుక్తులన్నీ పార్టీని బలోపేతం చెయ్యడం మీదనే కేంద్రీకరిస్తుందని అర్ధం. ఆ పని ప్రారంభించామని కూడా కిషన్‌రెడ్డి చెప్పారు. తప్పు లేదు. కానీ ఈ ఏడు మాసాల కాలంలో తెలంగాణ ముఖ్య మంత్రి అన్నీ మంచి నిర్ణయాలే తీసుకున్నారన్న కిషన్‌రెడ్డి మాటలు మాత్రం రాజకీయ పరిశీలకులలో పలు సందేహాలు కలిగించే విధంగా ఉన్నాయి. నాయకుల పరస్పర విరుద్ధ వైఖరులను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ బాట పట్టిందేమో అన్న సంశయం కలగక మానదు. బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి స్వరం ఒక లాగా వినిపిస్తే, ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వరం అందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ ఇంటర్వ్యూని బట్టి అర్థం అవుతున్నది. నిన్నటి దాకా కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, సమగ్ర సర్వే నుంచి మొదలై గోల్కొండ కోట మీద జెండా వందనం జరిపిన దగ్గర నుంచి నిన్నటి వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చే ప్రతిపాదన వరకు చేసిన తీవ్ర విమర్శలన్నీ ఏమయ్యాయి? తాము పొరపాటుగా విమర్శించాం, ఇప్పుడు ఆ పొరపాటును సరిచేసుకున్నాం అని కూడా చెబితే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చిన వాళ్లు అవుతారు. మంచిని ఆహ్వానిస్తాం, తప్పు చేస్తే విడిచి పెట్టం అనాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వానివి అన్నీ మంచి నిర్ణయాలే అనడం విడ్డూరం. చట్టసభలో సంఖ్య రీత్యా తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీ కాకపోవచ్చు కానీ, ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎది గిన పార్టీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న ఈ వైఖరి ఇతర పక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు లాభించేదే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మిత్ర పక్షంగా ఉండి అధికారంలో భాగస్వామి కూడా అయిన బీజేపీ తెలం గాణకు వచ్చే సరికి తన వైఖరి కొంత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకో వడం చూస్తే 2019 నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో జెండా ఎగురవేయాలన్న మోదీ, అమిత్‌షా ద్వయం వ్యూహం భవిష్యత్తు ఏమిటో బీజేపీ పెద్దలే ఆలో చించుకోవాలి. రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలను గురించి మాట్లాడుకునే క్రమంలో బీజేపీ ప్రస్తావన వచ్చినందునే ఈ విషయాల ప్రస్తావన.
 
అందరినీ కలుపుకుని పోవడమే మార్గం

మరోసారి కాంగ్రెస్ పార్టీ గత వారం ప్రారంభించిన రెండు రాష్ట్రాల ఆందో ళనల దగ్గరికి వద్దాం. రాష్ర్ట విభజన భారాన్ని మోస్తూ నడవలేక నడుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో, తీవ్రమైన అనైక్యత, అంతర్గత కుమ్ములాటలను వెంట వేసుకుని కుంటుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనల బాట పట్టింది. తెలంగాణలో ప్రజావసరాలను లెక్క చెయ్యకుండా ఆస్పత్రిని 70 కిలోమీటర్ల దూరం తరలించి ఆ స్థలంలో రాష్ర్ట సచివాలయ నిర్మాణానికి సంకల్పించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో రాజభవన్, ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభు త్వంలో భాగస్వామిగా ఉండి కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక ప్రతి పత్తి సాధించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న సర్కార్ వైఖరికి నిరసనగా కోటి సంతకాల ఉద్యమం... ఈ రెండూ తప్పనిసరిగా ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రభుత్వ వైఖరుల పట్ల ప్రతిఘటనే. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలను ఇందుకు అభినందించాల్సిందే. ఇక్కడా అక్కడా ప్రతిపక్షాలను రవ్వంత కూడా ఖాతరు చేయని నాయకులే పాలకు లుగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచీ అక్కడి ప్రధాన ప్రతిపక్షం ప్రతి సమస్య మీదా తనదైన పద్ధతిలో స్పందిస్తూనే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి దాకా ఆందోళన సాగిస్తూనే ఉంది. 66 మంది శాసన సభ్యులు ఉన్నా; తమకూ, ప్రతిపక్షానికీ ఐదు లక్షల ఓట్లే తేడా ఉన్నా ప్రతిపక్షమే లేదని భ్రమల్లో నివసిస్త్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి, ఉన్న ప్రతి పక్షాలను ఖతం చేసే కార్యక్రమం ప్రధానంగా ఎంచుకున్న తెలంగాణ  ముఖ్య మంత్రుల ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తే సరిపోదు. కాంగ్రెస్‌కు ఇక్కడా అక్కడా కూడా రాజకీయంగా బీజేపీతోనూ టీడీపీతోనూ పొసగదు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌నీ, వామపక్షాలనూ కలుపుకొనిపోనంత వరకు ఎన్ని కోట్ల సంతకాలు సేకరించినా, ఎన్ని చలో రాజభవన్‌లు నడిపినా ప్రయోజనం ఉండదు.

datelinehyderabad@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement