స్వాతంత్య్రం రాకముందు 1929 నాటి సైమన్ కమిషన్ ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు అమలు జరపాల్సి ఉండగా అది అమలు కాలేదు. ఉద్యోగరం గంలో 1993 నుంచి కేంద్రంలో రిజర్వేషన్లు అమలులోకి తెచ్చారు. అర్జున్ సింగ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. జనాభాలో 52% దాకా ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిం చారు. అయితే కేంద్ర శాఖల్లో 1993 నుంచి నేటివరకూ ఓబీసీలకు అమలు జరిగిన రిజర్వేషన్లు 5-6% మాత్రమే. సరైన అర్హతలు లేవని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అర్హతలున్నవారిని ఎంపిక చేయడానికి నిరాకరించారు. మరుసటి ఏడాది వాటిని రిజర్వేషన్ల నుంచి తొలగించి జనరల్ కేటగిరీలో కలిపారు. అలా 6%లోపే బీసీ రిజర్వేషన్లు అమలయ్యాయి. 2008లో ప్రవేశ పెట్టిన విద్యారంగ రిజర్వేషన్లలో 8% మాత్రమే బీసీ విద్యార్థులకు సీట్లు లభించాయి. మిగతా 19% అన్యాక్రాంతమైపోయాయి. ఇలా 90 ఏళ్ల పోరా టం తర్వాత బీసీలకు 27% రిజర్వేషన్లు కూడా అమలు కావడంలేదు.
పైగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్ అంటూ ఆదాయపరిమితి విధిస్తు న్నారు. అన్ని అవకాశాలను బీసీల్లోని సంపన్నవర్గాలే చేజిక్కించుకుంటా యని క్రీమీలేయర్ ప్రవేశపెట్టారు. మరి జనరల్ కేటగిరీలోనూ సంపన్నులు అన్నీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. అందుకే జనరల్‌లో కూడా ఐఏఎస్ మొదలుకుని అన్ని కేటగిరీలకు క్రీమీలేయర్‌ను అమలు చేయడం అవసరం. ఎన్నికలతోపాటు అన్ని రంగాల్లో క్రీమీలేయర్‌ను అమలు జరిపితే 125 కోట్ల జనాభాలో కొంతమందయినా కొత్త తరాల నుంచి ఎదిగే అవకాశం ఏర్పడు తుంది.
దేశంలో ఏ సామాజికరంగంలో లేని క్రీమీలేయర్ పద్ధతిని బీసీలకు అమలు జరిపే పేరిట 27% రిజర్వేషన్లలో 21% దాకా ఇతరులే దొంగిలిం చడం నేరం. దీన్ని జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని బీసీ కమిషన్ గమనిం చలేదు. ఇంత ప్రధాన కర్తవ్యాన్ని వదిలేసి జస్టిస్ ఈశ్వరయ్య తన సిఫా రసుల ద్వారా బీసీలకు ద్రోహం చేశారని చెప్పక తప్పదు. అన్ని రంగాల్లో క్రీమీలేయర్ అమలు జరిపేదాకా, 27% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలతో నిండే దాకా క్రీమీలేయర్‌ను అన్నిరంగాల్లో ఎత్తివేసినప్పుడే సామాజిక న్యాయం కొంతవరకైనా సాధ్యపడుతుంది. జస్టిస్ ఈశ్వరయ్య సిఫారసులను వ్యతి రేకిస్తూ, క్రీమీలేయర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బ్యాక్‌లాగ్ పోస్టుల విధానం అమలులోకి తేవాలని బీసీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
(క్రీమీలేయర్ విధానం రద్దు డిమాండ్‌తో నేడు హైదరాబాద్‌లో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం)
వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
వూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్: 9849912948