ఒక మహాత్ముడూ... ఒక అంబేడ్కరూ...!
దేశంలో కెల్లా ఎక్కువ ప్రాచుర్యం గల నేత గాంధీనా లేక అంబేడ్కరా? వర్థంతికో, జయంతికో లాంఛనప్రాయంగా నివాళులు అందుకుంటున్న గాంధీతో పోలిస్తే లక్షలాదిమంది దళితులు అంబేడ్కర్ అనే తమ ఉద్ధారకుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. తల్చుకుంటున్నారు. తేడా అల్లా ఇదే.
ముంబైలోని దాదర్ బీచ్ వద్ద ఉన్న చైత్యభూమి సమీపం లో, గతంలో పిండి మిల్లు ఉన్న చోట డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ భారీ స్మారక స్తూపం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ఆమోదించింది. ఎన్డీయే ప్రభుత్వం పిండిమిల్లు భూ మిని కేటాయించింది. బహుశా, మహారాష్ట్రలో బీజేపీ-శివ సేన ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ఒక రూపం దాల్చ వచ్చుకూడా. కాబట్టి ఈ కీర్తి ఎవరి ఖాతాలోకి వెళ్లాలి? భారీ స్తూపం అనే ఒక్క అంశాన్ని మినహాయిస్తే, ఏ ఒక్కరూ ఈ భారీతనం గురించి నిర్దిష్టమైన అవగాహనతో ఉన్నట్లులేదు. అక్కడ ఒక ఉద్యానవనం, ఆ నేతకు సంబంధించిన మ్యూజి యంతో కూడిన ఎత్తై నిర్మాణాన్ని నెలకొల్పాలా లేక అది దళితుల ఆకాంక్షలను నెరవేర్చే కేంద్రంగా అంటే ఒక హాస్టల్, కోచింగ్ కేంద్రం, గ్రంథాలయంలాగా ఉండాలా? స్తూపం కోసం కేటాయించిన విశాలప్రాంతంలో దళితుల కోసం ఒక పెద్ద సంస్థను ఏర్పర్చవచ్చు. అయితే ‘నాక్కూడా’ అనే రాజకీయ నేతల అవసరాలను ఇది నెరవేర్చకూడదు.
ఒక ఆదర్శంలోని సారాంశం కంటే దాని చిహ్నాలే రాజ కీయ పార్టీల నేతలకు ముఖ్యం. వ్యక్తిగత పూజలు, నినా దాలు, చిహ్నాలు భారత రాజకీయాల్లో కలిసే కాపురం చేస్తుం టాయి. వాస్తవానికి ఇవే మన రాజకీయాల్లో కీలకమైనవి.
ఇటీవలే మనం అంబేడ్కర్ 124వ జయంతిని జరుపు కున్నాం. దేశంలో ఎక్కువ ప్రాచుర్యంగల నేత గాంధీనా లేక అంబేడ్కరా? అంటూ చర్చ నడుస్తోంది. గాంధీ ప్రతి ఏడాది రెండుసార్లు అంటే అక్టోబర్ 2న, జనవరి 30న పునరుత్థానం చెందుతుంటారు. ఆయనకు హృదయంతో కాకుండా పెదవు లతో మాత్రమే నివాళి అర్పిస్తుంటారు. వీవీఐపీలు హాజరవు తుంటారు కనుక అధికారిక లాంఛనాలతోపాటు మీడియా కూడా కాస్త ఆసక్తి ప్రదర్శిస్తుంది.
ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ, ప్రతి గుడిసె లోనూ దళితులు తమ మహానుభావుడికి వందనాలు పలుకు తున్న ఘటనతోనూ, దాదర్ బీచ్‌లో అంబేడ్కర్‌ని సమాధి చేసిన చోటికి ప్రతి ఏటా డిసెంబర్ 6న లక్షలాదిగా దళితులు హాజరవుతూ నివాళి పలుకుతున్న ఘటనతోనూ గాంధీ జయంతి, వర్ధంతిల తంతును పోల్చి చూడండి మరి. ఒక సార్వత్రిక కారణం కోసం పోరాడుతున్నప్పుడు అంబేద్కర్ దళిత ప్రతీకలాగే ఉండేవారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న తమ మహానుభావుడి విగ్రహానికి నివాళి పలికేందుకు ప్రతి ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద నమ్మశక్యం కానంత పెద్ద సంఖ్యలో దళితులు గుమికూడుతుంటారు. ఈ భారీ మేళాలో అంబేడ్కర్ రచించిన పుస్తకాలు, ఆయనపై ఇతరు లు రచించిన పుస్తకాలను ప్రదర్శిస్తుంటారు. ఇంకా ముఖ్యం గా, ఆయన విగ్రహాలు, చిత్రాలను చాలా మంది కొని తీసు కెళుతుంటారు. అంబేడ్కర్, గాంధీలు తమ జీవితకాలంలో జాతికి విశేష సేవ చేసి ఉండొచ్చుకానీ, గాంధేయవాదులం దరికంటే మిన్నగా దళితులు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొం టారని, అలాగే గాంధీ కంటే అంబేడ్కర్‌కే ఎక్కువ మంది తమ కృతజ్ఞతలను తెలియజేస్తుంటారని ఒక అం చనా. వారి దృష్టిలో ఆయన దైవ సమానుడు. అంబేడ్కర్ జీవించి ఉంటే, ఈ విగ్రహారాధనకు ముగింపు పలకమని చెప్పేవారు. అలాగే దాదాపుగా విస్మృతి గర్భంలో కలిపివేసిన తన భావాలను లాంఛనప్రాయంగా ప్రకటించడం మానుకో వలసిందిగా గాంధీ చెప్పి ఉండేవారు. మున్నాభాయ్ లాగే.. తనను ఆదర్శీకరించవద్దని, తన మార్గాన్ని అవలంబించమని మాత్రమే చెప్పి ఉండేవారు.
భారత్‌లో రాజకీయాలు వ్యక్తిగత ఆరాధనలపై ఊగులా డుతుంటాయి. తొలుత గాంధీని, తర్వాత మరొక గాంధీగా మారిన అంబేడ్కర్‌ని వారి ఆదర్శాల ప్రాతిపదికపై కాకుం డా, ఆరాధన తోటే అనుసరిస్తున్నారు. మార్క్స్, లెనిన్ సైతం ఇలాంటి మన్ననలనే అందుకున్నారు. గతవైభవ దీప్తి కోసం వెదుకులాటలో భాగంగా నరేంద్ర మోదీ గుజరాత్‌లో సర్దార్ పటేల్‌ను పునరుత్థానం చేస్తున్నారు. అంతే తప్ప ప్రతి రోజూ దళితులపై జరుగుతున్న అత్యాచారాలను వీరిలో ఎవరూ నివారించే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.
దళిత నేతలు కూడా రాజకీయాల్లో తమ నడవడిక విష యంలో వెనుకబడిపోతున్నారు. తమ నియోజకవర్గాల సమ స్యల పరిష్కారంలో సృజనాత్మకతను ప్రదర్శించని వీరు, వ్యక్తిగత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. నిస్సహాయుల వెతలు పట్టించుకోకుండా తమ అధికారం కోసం తాపత్రయం చెందుతూ దళితుల ఉమ్మడి ప్రయోజ నాలను పక్కనబెడుతున్న తమ నేతల వ్యవహారం గురించి దళితులకు అవగాహన ఉంది. చీలిపోతూ, కలుస్తూ కాలం గడుపుతున్న రిపబ్లికన్ పార్టీలో మరింత ఐక్యతను వారు ఇష్ట పడుతున్నారు. అంబేద్కర్ ఉద్ధారకుడు కాబట్టే ఆయనను ప్రజారాసులు పూర్తిగా ఇష్టపడుతున్నాయి. అసమానతలకు ముగింపు పలకాలని కోరుకుంటున్న అంబేడ్కర్ అనుయా యులు, రాజకీయాల్లో తక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ, ఏ రాజకీయ నేత, ఆయన అనుయాయులు మనదేశంలో ఇంత సాన్నిహిత్యబంధంతో లేరు.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) mvijapurkar@gmail.com
మహేష్ విజాపుర్కార్