
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 95 నుంచి 105 సీట్లలో విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని కోట్లాది ప్రజల అభిప్రాయాలను ఒక వ్యక్తి ఎలా చెబుతారని లగడపాటి రాజగోపాల్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మంత్రి తలసాని మాట్లాడూతూ.. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సర్వేలు చేస్తున్న వారు ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందో కూడా చెప్పాలని నిలదీశారు.
ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి మొదట మద్దతు తెలిపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ‘పార్టీలు మారిన వారిని ఓడించండని చంద్రబాబు చెప్పడం గురి విందగింజ సామెత లాం టిదే. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరా యించిన ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరు. కాంగ్రెస్ ప్రచారానికి రూ.500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. లగడపాటి సర్వే కొంతమంది కలసి చేసిన కుట్ర. హైదరాబాద్ ప్రజలను ఎవరూ ప్రభావితం చేయలేరు. హైదరాబాద్‌లో లక్షల ఇళ్లు కడుతున్నాం. దమ్మూధైర్యం ఉంటే నా వెంట రండి చూపిస్తా. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం చిన్నాభిన్నమవుతుంది. నాలుగేళ్లు మోదీతో కలసి ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు చిన్న మోదీ అని కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదం. ఇంట్లో కూర్చొని సర్వేలు రిలీజ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.