
‘ఈ బాబు మాకొద్దు’ నినాదంతో ఏపీ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్తాం.
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఓడించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై తలసాని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో తలసాని మాట్లాడుతూ.. ఏపీ హక్కుల కోసం టీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. లోటు ఆదాయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నవనిర్మాణ దీక్ష పేరిట టీడీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వృథా చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు.. ‘ఈ బాబు మాకొద్దు’ నినాదంతో ఏపీ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్తామని తలసాని పేర్కొన్నారు. శవరాజకీయాలు చేసే చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఎద్దేవా చేశారు.
ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది బాబూ!
‘చంద్రబాబుకు బంధాలు, బంధుత్వాల విలువ తెలియదు. చేరదీసిన ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. ఫెడరల్ ఫ్రంట్ లేదన్న చంద్రబాబుకు దాని ప్రతాపమేంటో త్వరలోనే తెలుస్తుంది. ఆయనలా మాది మోసపూరిత జీవితం కాదు. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూసేదే ఆయన. కులాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే. బీసీలకు, కాపులకు గొడవ పెట్టింది కూడా టీడీపీయే. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే... మా సమాధానాలు చాలా ధీటుగా ఉంటాయి. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో కరెంట్, నీళ్ళు కూడా లేవు... మా సీఎం వచ్చాకే అన్నీ ఒక్కొక్కటిగా తీర్చాము. మీ అందమైన మొహాన్ని చూస్తేనే అందరికీ మీరంటే ఏంటో తెలుస్తుంది. నీతి, జాతి లేని మాటలు మాట్లాడే, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుని చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది. నాలుగేళ్లైనా అమరావతిని ఎందుకు నిర్మించలేదు. టీడీపీ ఓడిపోతేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. ఆయన మంత్రులు ఫెడరల్ ఫ్రంట్‌పై అనవసర, అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రజలు మరో మూడు నెలల్లో చంద్రబాబును తరిమికొడతారు. త్వరలోనే కేసీఆర్ కూడా ఏపీకి వస్తారు’ అని తలసాని వ్యాఖ్యానించారు.