
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరు అయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగే విధంగా విపక్షాల మద్దతు కోరేందుకు కేంద్రం ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసింది. 17వ లోక్‌సభ రేపు కొలువుదీరనుంది. 17, 18 తేదీల్లో దిగువ సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఈ నెల 19న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 20న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 26 వరకూ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో గత ప్రభుత్వం జారీచేసిన 10 ఆర్డినెన్స్‌లను చట్టరూపం ఇచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో కీలకమైన ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఉంది.