ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)
సాక్షి, మంగళగిరి: రాజధానిలో దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడికి లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రకటించిన సమయంలో దళితులకు చెందిన అసైన్ట్, లంక, ప్రభుత్వ భూములకు రైతుల భూములతో పాటు పరిహారం ప్రకటించకుండా చంద్రబాబు బినామీలు దళితులను బెదిరించి, పరిహారం రాదని భయపెట్టి దళితుల భూములన్నింటిని తక్కువ ధరలకు కొట్టేసినప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నిద్రపోతున్నారా అని నిలదీశారు. రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాని మరెవరైనా కాని రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా అని ప్రశ్నించారు. తాడికొండ, తుళ్ళూరులతో పాటు రాజధానిలో మంగళగిరి భాగం కాదా చెప్పాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇప్పుడు దళితులు గుర్తుకువచ్చారా అని నిలదీశారు. అసలు రాజధానిలో దళితుల భూములన్నింటిని రాజధాని ప్రకటించేనాటికే టీడీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజధానిలో ప్లాట్లు కేటాయించే సమయంలోనూ దళితులకు ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయిస్తుంటే మాజీ ఎమ్మెల్యేకు కనిపించలేదా అన్నారు. ప్లాట్ల కేటాయింపులోను టీడీపీ నాయకులు వారికి నచ్చిన చోట వారికి నచ్చిన విధంగా వాస్తులు చూసుకుని మరీ ఇచ్చుకుని లాటరీ అంటూ రైతులను మభ్యపెట్టారన్నారు. రాజధాని భూములపై విచారణ కొనసాగుతుందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను నిరూపిస్తామని స్పష్టం చేశారు. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి రాజధానిని అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment