న్యూఢిల్లీ: సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తప్పవని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీజేపీ, ఎల్‌జేపీ నాయకులను ఎగతాళి చేస్తూ గిరిరాజ్ సింగ్ మంగళవారం ట్వీట్ చేశారు. నితీశ్‌తో కలిసి సుశీల్‌కుమార్ మోదీ, రామ్‌విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను కూడా షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవాలను ఇంతే ఉత్సాహంగా ఎందుకు జరుపుకోరని ప్రశ్నించారు.
బీజేపీ, జేడీ(యూ) సంబంధాల్లో బీటలు వారుతున్న నేపథ్యంలో గిరిరాజ్ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని జేడీ(యూ) అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విమర్శించారు. గిరిరాజ్ మానసిక పరిస్థితి సరిగా లేదని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ కూడా గిరిరాజ్‌ను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయనను అమిత్ షా హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గిరిరాజ్.. సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై భారీ విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment