అమిత్ షా (ఫైల్ ఫోటో)
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నోరు జారారు. దావణగెరెలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పతో పాటు పార్టీనీ ఇరుకున పెట్టారు. సిద్దరామయ్య అనడానికి బదులుగా యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అంటూ మాట తూలారు. ప్రసంగంలో అమిత్ షా ఏమన్నారంటే.. ‘ఈ మధ్య సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఒకరు నాతో మాట్లాడారు.
అవినీతి ప్రభుత్వాల మధ్య పోటీ పెడితే కచ్చితంగా యడ్యూరప్ప ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అదే వేదికపై ఉన్న యడ్యూరప్ప ముఖం కందగడ్డలా మారిపోయింది. పక్కనే కూర్చున్న ఎంపీ ప్రహ్లాద్ జోషి అవాక్కయ్యారు. సిద్దరామయ్య ప్రభుత్వం అంటూ షా చెవిలో ఊదారు. వెంటనే సర్దుకుని.. సిద్దరామయ్య అంటూ అమిత్ షా ప్రసంగాన్ని కొనసాగించారు.
అయితే, కాంగ్రెస్ మద్దతుదారులు అప్పటికే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయటం, అది వైరల్‌గా మారటం చకచకా జరిగిపోయాయి. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. ‘అబద్ధాల పుట్ట అయిన అమిత్ షా ఇన్నాళ్లకు నిజం మాట్లాడారు.. ధన్యవాదాలు..’అంటూ ట్వీట్ చేశారు. ‘అమిత్ షా కూడా నిజాలు చెబుతారని ఎవరికీ తెలీదు. మీ వ్యాఖ్యలతో మేమూ ఏకీభవిస్తున్నాం..’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి రమ్య ట్వీట్ చేశారు.
గెలుపు మాదే
కర్ణాటకలో ఈసారి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు తమదేనని, యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం తథ్యమని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగుర వేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న లింగాయత్, వీరశైవుల మధ్య సిద్దరామయ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. బీజేపీ విజయం ఖాయమని తేలడంతో కాంగ్రెస్ కుల, మత రాజకీయాలకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ పాలన ఐదేళ్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి సిద్దరామయ్యకు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment