మీడియాతో మాట్లాడుతున్న కె. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14న అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ఉందని, ఆ సమావేశంలో అమిత్ షా పర్యటన తేదీలు ఖారారవుతాయని పేర్కొన్నారు. అమిత్ షా పర్యటన విధి, విధానాల ఖరారు కోసం ఈ నెల 17, 18 తేదిల్లో హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ హజరవుతున్నారన్నారు.
తెలుగురాష్ట్రాలకు కేంద్ర ఎంతో సాయం చేసింది
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నప్పటికీ.. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంపై అనవసర నిందలు వేయడం సరికాదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో 1500 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నాలుగేళ్లలో తెలంగాణకు 3వేల కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చిన ఘనత గడ్కరీదేనన్నారు. 50 వేల కోట్ల రూపాయలతో జల రవాణా మార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు.
‘రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్రం 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడా కేంద్రం అన్ని రకాల అనుమతులు మంజూరు చేసింది. అయినా కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేయడం దారుణమ’ని లక్ష్మణ్ అన్నారు. ఈ నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎంత ఖర్చుచేసింది, ఎంత అభివృద్ధి చేసిందనే దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ కోరుకుంటోందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ బీజేపీని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment