సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర శాసనసభలో సోమవారం దుమారం రేగింది. అధికార పక్షం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రతిపక్ష సభ్యులు మౌనం దాల్చాల్సి వచ్చింది. ‘ఈ ప్రాజెక్టు అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడిన మాట నిజం కాదా? మాజీ ఆర్థిక మంత్రి వియ్యంకునితో సహా పలువురు కావాల్సిన వాళ్లకు నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టులు అప్పగించింది వాస్తవం కాదా? అడుగుకు ఒక ఫొటో, గజానికొక శిలాఫలకంతో ప్రచార హోరెత్తించిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క నిర్వాసితునితోనైనా ఫొటో ఎందుకు దిగలేదు’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టుకు నీళ్లిస్తాం.. రాస్కో జగన్‌మోహన్‌రెడ్డీ.. అని ఆనాడు శాసనసభలో ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, శ్రీ బాల వీరాంజనేయ స్వామి అడిగిన ప్రశ్నపై సుదీర్ఘ చర్చ జరిగింది.
టీడీపీ నిర్వాకం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదు
పోలవరం అంచనా వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.55 వేలకు పెరిగిన మాట వాస్తవమేనని మంత్రి అనిల్ యాదవ్ సమాధానం చెప్పిన తర్వాత గోరంట్ల అనుబంధ ప్రశ్న వేస్తూ.. అంచనాల పెంపును కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించినప్పుడు గత టీడీపీ ప్రభుత్వం రూ.33 వేల కోట్లు దోచేసిందని ఎలా అంటారని ప్రశ్నించడంతో దుమారం రేగింది. అధికార పార్టీ సభ్యుడు పార్థసారథి జోక్యం చేసుకుంటూ పోలవరంతో పాటు మొత్తం ప్రాజెక్టులపై చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ వైఎస్‌కు ముందు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఏనాడూ పోలవరాన్ని పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాకే పోలవరం ప్రాజెక్టు చేపట్టి, అన్ని అనుమతులు తీసుకువచ్చి.. కుడి, ఎడమ కాల్వలు కూడా పూర్తి చేశారన్నారు. ఆయనే గనుక కాల్వలు తవ్వి ఉండకపోతే భూసేకరణకు ఇప్పుడు వేల కోట్ల రూపాయల భారం పడి ఉండేదన్నారు.
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పోలవరం కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350 కోట్లు కొట్టేశారన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా బస్సుల్లో ప్రజలను తరలించి రూ.వందల కోట్లు దోచేశారన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఆర్ అండ్ ఆర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుంటూ స్పిల్ వే కు తామే భూమి సేకరించామని, ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ ధరలు 11 రెట్లు పెరిగాయని, వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టుల్లో వెసులుబాటు కాని వాటి ధరలను తాము సవరించి చేపట్టామని వివరిస్తూ స్వల్పకాలిక చర్చ పెట్టాలని కోరారు. దీనికి మంత్రి సంసిద్ధత వ్యక్తం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టులో అంచనాలు పెంచి రిత్విక్ అనే సంస్థకు అప్పగించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన ప్రకారం ప్రాజెక్టు కింద భూమి కోల్పోయి తక్కువ పరిహారం పొందిన రైతులకు మొత్తాన్ని పెంచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment