సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకెలాంటి సమాచారం లేదని, ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను అపహరించినట్లు తాజాగా వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం.
టీడీపీ యాప్‌లోకి ఓటర్ల మాస్టర్ డేటా..
ఓటర్ల మాస్టర్ డేటా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటా టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా ఆధార్ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్ డేటాలోనే ఆధార్ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ఆధార్ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment