సాక్షి, విశాఖపట్నం : అన్ని వర్గాలకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. భీమిలిని అభివృద్దిలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన ఆశయం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్‌లకు సీఎం రూ. 10000 వేలు ఇస్తున్నారు.. అలాగే పద్మనాభం, ఆనందపురం మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు. ఇక చోడవరం ఎమ్మల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ఏర్పాటు చారిత్రాత్మకం అన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని అధికారులే దగ్గరుండి మద్యం విక్రయిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, దీంతో ఆయన నైజం ఏంటో బయటపడిందని విమర్శించారు.
అలాగే చంద్రబాబు అబద్దాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అక్టోబర్ 2వ తేదీన ఎక్కడా మద్యం దుకాణాలు తెరవలేదని వెల్లడించారు. మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక ఆసత్య ప్రచారం చేస్తున్నారని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 43 వేల బెల్టు షాపులను మూసివేయించారని తెలిపారు. రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గిపోయాయని, 2018 జూన్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు 126 లక్షల కేస్‌ల మద్యం విక్రయాలు జరిగితే.. తమ ప్రభుత్వం వచ్చాక 105 లక్షల కేసులు తగ్గిపోయాయన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాలపై చంద్రబాబు చేస్తున్న రాజకీయ ప్రకటనల్లో ఒక్కటైనా రుజువు చేయగలరా అని ఆయన సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment