న్యూఢిల్లీ: బూటకపు వార్తలు రాసే జర్నలిస్టులను శిక్షిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసి.. వెంటనే ఉపసంహరించుకున్న ఉత్తర్వులపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ మండిపడ్డారు. మీడియాను అణచివేసేందుకు చేసిన ప్రయత్నం ఇదని స్పష్టమవుతుందని, మున్ముందు ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియకుండానే కేంద్ర సమాచార, ప్రసార మంత్రి స్మృతి ఇరానీ ఈ ఉత్తర్వులు తీసుకొచ్చినట్టు తాను భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆయనకు తెలియకుండా చిన్న ఆకు కూడా కదలదు. మరీ అలాంటప్పుడు ఇంత తీవ్రమైన ప్రభావం కలిగిన ఉత్తర్వులు పీఎంవోతో సంప్రదించకుండానే రూపొందించారా’అని శౌరీ పేర్కొన్నారు.
ఫేక్ న్యూస్ రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ (ప్రభుత్వ గుర్తింపు) రద్దుచేస్తామని, ఎవరైనా నకిలీ కథనాలపై ఫిర్యాదుచేస్తే.. గుర్తింపు కోల్పోక తప్పదంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వివాదాస్పద మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడం, పాత్రికేయలోకం తీవ్రంగా నిరసన తెలుపడంతో ఈ ఉత్తర్వులను కేంద్రం వెనుకకు తీసుకుంది. ఈ వ్యవహారం నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్వాలని, మీడియాను అణచాలని చూసిన ప్రతిసారి సునామీ తరహా ప్రతిఘటన ఎదురవుతుందని గుర్తించాలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్ అయిన అరుణ్ శౌరీ హితవు పలికారు.
ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేయడం ఈ ఉత్తర్వుల వెనుక ఉద్దేశం కాదని, ఎందుకంటే ప్రభుత్వంలోని వారే అతిపెద్ద ఫేక్‌న్యూస్ సృష్టికర్తలని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఉత్తర్వులను ఎంతమాత్రం ఆమోదించవద్దని, మీడియా స్వేచ్ఛను హరించేందుకే ప్రభుత్వం ఇలాంటి మార్గదర్శకాలను సాధనంగా వాడుకుంటుందని ఎమర్జెన్సీ కాలంలో పౌరహక్కుల కోసం కథనాలు రాసిన శౌరీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment