
సాక్షి, విజయవాడ : ఎదుటివారిని ఇబ్బంది పెట్టి ఆనందపడటం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నైజం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. వ్యవస్థలని చేతుల్లో పెట్టుకుని చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు వికృత చేష్టలకు ఆయన పార్టీ కేడర్ ఇబ్బంది పడుతోందన్నారు. ప్రభుత్వంలో లోపాలు చూపలేక చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది కక్ష సాధించే తత్వం కాదని స్పష్టం చేశారు. అన్ని మంచి క్వాలిటీలు ఉండబట్టే ఆదరణలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచారని తెలిపారు. గతంలో సమన్వయ లోపంతో బోట్ ప్రమాదాలు జరిగేవని చెప్పారు. విధివిధానాలు కూడా సక్రమంగా ఉండేవి కావని.. కానీ ఇప్పుడు పర్యాటకుల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొచ్చారని వెల్లడించారు. ప్రమాదాలు నివారించేందుకు తొమ్మిది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.