
ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన బాబూమోహన్. చిత్రంలో లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: ‘నాలుగేళ్లపాటు అలుపెరగకుండా ప్రజాసేవ చేశా. ఎన్నడూ అబద్ధం ఆడలేదు. లంచాలు తీసుకోలేదు. అక్రమాలు చేయలేదు. అలాంటిది నాకు టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ నిరాకరించి ఒక చేతకానివాడిగా చిత్రీకరించింది. అది నన్ను తీవ్రంగా బాధించింది. కనీసం టికెట్ ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పలేదు. అయితే బీజేపీలో పనికొస్తానని అమిత్‌షా స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక నుంచి నేనేంటో చూపిస్తా’అని అందోల్ టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో తన కుమారుడు ఉదయ్ భాస్కర్‌తో కలసి వచ్చి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. అనంతరం బాబుమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు ప్రకటించకపోగా తనను చేతకానివాడిగా చిత్రీకరించి పక్కన పెట్టడం తీవ్రంగా బాధించిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్‌రావు పిలిస్తేనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని, అలాంటిది ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై కనీసం సమాధానం కూడా చెప్పలేదన్నారు. మొదట కేటీఆర్‌ను సంప్రదిస్తే కేసీఆర్ నేరుగా మాట్లాడతారని చెప్పారన్నారు. అయితే గత 25 రోజులుగా ఎదురుచూసినా కేసీఆర్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తనను పనికిరానివాడిగా చిత్రీకరించి పక్కనపెట్టినా.. బీజేపీలో పనికొస్తానని అమిత్‌షా గుర్తించి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.
గతంలో నరేంద్ర మోదీ, అమిత్‌షా నాయకత్వంలో పనిచేయాలన్న కోరిక ఉండేదని, అందుకే బీజేపీలో చేరానని చెప్పారు. ఇక నుంచి తానేంటో చూపిస్తానని, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, ఏం చెప్పాలో అక్కడే చెప్తానని అన్నారు. కాగా, బాబుమోహన్ సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్–టీడీపీలది మహాకూటమి కాదని, అదో విషకూటమి అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్టే అని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని పేర్కొన్నారు. అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా బాబూమోహన్ అందోలు నుంచి పోటీ చేస్తారని స్థానిక బీజేపీ నాయకులు అంటున్నారు. కాగా, అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ఢిల్లీలో బాబూమోహన్ ప్రకటించడంతో ఆయన ఎక్కడ పోటీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment