
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేతలు పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తూ వారి వ్యక్తిత్వా న్ని కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ను బచ్చా అంటున్న టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఓ లుచ్చా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, కోదండరాంతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పై నోట్ల కట్టలతో దండయాత్రకు వస్తున్నారని గవర్నర్ జోక్యం చేసుకుని ఇలాంటి వాటిని కట్టడి చేయాలని ఆయన కోరారు.
ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమతో కలిసి బాల్కసుమన్ తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలు శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెట్టినట్టు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ని వీడే ప్రసక్తే లేదని తుల ఉమ అన్నారు. పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.