
కరీంనగర్‌లో తన ఇంటిపై నల్లజెండా ఎగురవేస్తున్న బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌టౌన్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారు తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ శనివారం కరీంనగర్‌లోని తన నివాసంపై నల్ల జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని బీజేపీ లేవనెత్తే వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదని, అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాయడం, నిరసన దీక్ష వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇవాళ ఇంటిపై నల్లజెండా ఎగరేసే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టుకోవడంలో విఫలమైన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.