కోల్‌కతా : ప్రముఖ బంగ్లాదేశ్ నటి అంజు ఘోష్ బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో బుధవారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియా సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశీయురాలుగా కొనసాగుతున్నారా.. లేక భారత పౌరసత్వం తీసుకున్నారా అనే దానికి అంజూ స్పష్టత ఇవ్వలేదు. అంజూ 1989లో వచ్చిన హిట్ మూవీ బెడెర్ మెయ్ జోస్నాలో నటించారు. ఈ చిత్రం బంగ్లాదేశ్ సినీ చరిత్రలో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఆమె బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి ప్రచారం నిర్వహించిన బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ అహ్మద్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫిర్యాదు చేయడంతో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతని బిజినెస్ వీసాను రద్దు చేసింది. అంతేకాకుండా తక్షణమే భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు అదే బీజేపీ బంగ్లాదేశ్ నటిని తమ పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు బీజేపీపై ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమెను బీజేపీ ఎలా తమ పార్టీలో చేర్చుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అంజూ ఘోష్ తన పౌరసత్వాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment