శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని శుభ్రం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
కోల్‌కతా : పాలు, గంగా జలంతో బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రోడ్లపై దర్శనమిస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాల్లో కొన్ని ధ్వంసం కాగా.. కొన్నింటికి రంగులు పూసేశారు. దీంతో తాము శుభ్రం చేస్తున్నట్లు వాళ్లు చెప్తున్నారు.
గురువారం కియోరటలా స్మశాన వాటిక దగ్గర ఉన్న జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అవమానించారన్నది బీజేపీ ఆరోపణ. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసానికి అతి దగ్గర్లో ఉన్న ఈ విగ్రహనికి నలుపు రంగు పూయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు తామీ విగ్రహాన్ని శుభ్రం చేస్తున్నామని బీజేపీ కార్యకర్తల మాటగా ‘ది వైర్’ కథనం ప్రచురించింది.
అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. విగ్రహానికి అవమానం జరిగిందన్న వార్త తెలిసి తామూ అక్కడికి చేరుకున్నామని.. కానీ, అప్పటికే అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని ప్రత్యారోపణలు చేస్తున్నారు. మరోవైపు త్రిపురలో లెనిన్ విగ్రహానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా వామపక్ష వర్గాలే ఈ దాడికి పాల్పడ్డాయన్నది మరో వర్గం ఆరోపణ.
సెటైర్లు... అయితే ఉన్నట్లుండి తమ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ్ ప్రసాద్ విగ్రహాలపై మమకారం ప్రదర్శిస్తున్న బీజేపీపై మిగతా విగ్రహాలు ఏం పాపం చేశాయని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చి ఆ తలతో ఫుట్ బాల్ ఆడుకున్న బీజేపీ కార్యకర్తలు- వారిని ఆకాశానికి ఎత్తేస్తూ అభినందనలు గుప్పించిన బీజేపీ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల సంగతేటని ప్రశ్నిస్తున్నారు. గాంధీ, అంబేద్కర్, పెరియార్.. ఇలా విగ్రహాల విధ్వంసం కొనసాగుతున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది వారి ప్రధాన ప్రశ్న. కానీ, మిగతా విగ్రహాలపై కూడా కాషాయ దళాలు ఇదే రీతిలో ప్రేమను ప్రదర్శించాలని కోరుకోవటం తీరని ఆకాంక్షే అన్నది విమర్శకుల మాట.
Comments
Please login to add a commentAdd a comment