ప్రతిపక్షాన్ని హేళన చేసిన బీజేపీ ఎంపీలు | BJP Heckling Of Opposition is wrong | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాన్ని హేళన చేసిన బీజేపీ ఎంపీలు

Published Wed, Jun 19 2019 2:42 PM | Last Updated on Wed, Jun 19 2019 5:39 PM

BJP Heckling Of Opposition is wrong - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రతిపక్షానికి పార్లమెంట్‌లో ఎంత మంది ఉన్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. పార్లమెంట్‌ కార్యకలాపాల్లో ప్రతిపక్షాలు క్రియాశీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అత్యవసరం. కలిసికట్టుగా ముందుకు సాగి దేశాభివద్ధికి కషి చేయాలన్నది నా అభిమతం’ అని పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజైన సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ లోపల, బయట విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తి విపక్షాలకు ఎంత అర్థమైందో తెలియదుగానీ పాలకపక్ష బీజేపీ ఎంపీలకు అస్సలు అర్థం కాలేదు. 

తెలంగాణ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వెళుతుంటే బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్, భారత్‌ మాతా కీ జై, వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ప్రొటెమ్‌ స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ కూడా వారిని వారించలేక పోయారు. నినాదాల మధ్య మౌనంగా నడుచుకుంటూ వెళ్లిన ఒవైసీ ప్రమాణ స్వీకారం అనంతరం ‘జై భీమ్, అల్లాహు అక్బర్‌’ అంటూ ప్రతిగా నినాదాలు చేశారు. జై భీమ్‌ అంటూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరిట నినాదాలు చేయడం బీజేపీ సభ్యులను కాస్త ఇరుకున పెట్టింది. ఒవైసీ ఒక్కరి పట్లనే బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించలేదు. ప్రతిపక్ష సభ్యుల అందరి విషయంలో వారు అలాగే వ్యవహరించారు. 

సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎంపీ షఫీకర్‌ రహమాన్‌ బార్క్‌ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు కూడా బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. అందుకు ఆయన ప్రతిగా ‘కానిస్టిట్యూషన్‌ జిందాబాద్‌’ అంటూ నినదించారు. అదే పార్టీకి చెందిన హెచ్‌టీ హాసన్‌కు అదే అనుభవం ఎదురవ్వగా ఆయన ‘హిందుస్థాన్‌ జిందాబాద్‌’ నినదించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన తణమూల్‌ ఎంపీలు, తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలు ప్రమాణం చేసినప్పుడు, అందులోనూ ప్రధాని స్ఫూర్తిదాయక వాఖ్యలు చేసిన సోమవారం నాడే బీజేపీ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ ఎంపీ సోనియా గాంధీ ప్రమాణం చేసిన తర్వాత హిందీలో ప్రమాణం చేసినందుకు ఆమెకు కతజ్ఞతలు తెలిపారు. అక్కడ కూడా ఆమె ఇటలీకి చెందిన వనిత అని గుర్తు చేయడమే!

543 లోక్‌సభ స్థానాలకు 303 స్థానాలు గెలుచుకోవడంతో పార్లమెంట్‌ నియమ నిబంధనలకు తాము అతీతులమని బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు ఉంది. వారు ప్రతిపక్షం పట్ల సమభావం చూపకపోతే తమ నాయకుడు మోదీ చేసిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని వారే పాతరేసినట్లువుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement