బీజేఎల్‌పీ నేత జి. కిషన్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: చట్టసభల్లోనే కాదు బహిరంగ సభల్లో కూడా నిద్రపోయే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని తెలంగాణ బీజేఎల్‌పీ నేత కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అంతా డొల్లతనం, అవగాహనా రాహిత్యం, కుర్రతనమే కనిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ పగటి కలలు కనే వ్యక్తి అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిందని, బీజేపీని ఎదుర్కొనే సత్తా లేకే చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో పంచభూతాలను అవినీతిమయం చేసి కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని తూర్పారబట్టారు. మోదీ స్థాయి రాహుల్‌కు లేదని..నీకు మేము చాలు అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కుటుంబ పాలన మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిలబడిందే కుటుంబ పాలన మీద అని ఘాటుగా విమర్శించారు. ఒక నాణానికి రెండు వైపులా ఉంది కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లేనని వ్యాఖ్యానించారు. స్వామి పరిపూర్ణానందను అకారణంగా నగర బహిష్కరణ చేశారని, ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పి హైదరాబాద్‌కు తీసుకురావాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.10 కోట్ల కుటుంబాలకు ఉపయోగపడే ఆయుష్మాన్‌భవ కార్యక్రమంపై మోదీ ఆగస్టు 15న ప్రకటన చేయడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయింది...ఈ తరుణంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment