
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మీద బీజేపీ తెలంగాణ అగ్రనేత నల్లు ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలను వాడుకోవడంలో, సమస్యలను పక్కదోవ పట్టించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు ఇప్పుడే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని, మోదీ సర్కారు నుంచి బయటికి వస్తే కక్షతో నోటీసులు ఇచ్చారని మాట్లాడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శమని ధ్వజమెత్తారు. ఏపీలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు మోదీ మీద నెపం నెడుతున్నారని మండిపడ్డారు. బాబుపై 17 కేసులు ఉన్నాయని, నాట్ బిఫోర్ మీ అనే పదం వాడి కేసు కొట్టేయించుకున్నాడని ఆరోపించారు.
న్యాయవ్యవస్థలను వాడుకోవడంలో బాబు మించినోడు లేరని వ్యాఖ్యానించారు. బాబ్లీ కేసులో ఇదివరకే 37 సార్లు నాన్‌బెయిలబుల్ వారంట్‌లు ఇచ్చారని, ఇది 38వ నాన్‌బెయిలబుల్ వారంట్ అని వెల్లడించారు. గతంలో 37 సార్లు నాన్ బెయిలబుల్ వారంట్‌లు తీసుకోకుండా రకరకాల పద్ధతుల్లో ఆపుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ, మోదీలను తిట్టడం కోసం దీన్ని వాడుకుంటున్నాడని చెప్పారు. బాబు ఏపీ సీఎం అయ్యాక, కక్షతో ఏపీలో మా నాయకులు, కార్యకర్తల మీద ఎలా కేసులు పెట్టించారో మాకు తెలుసునని అన్నారు. ఉద్యమాల్లో, నిరసన కార్యక్రమాల్లో కేసులు వెయ్యడం సహజమని, దాన్ని రాజకీయాలకోసం వాడుకోవడం తగదన్నారు.
సీఎం అయితే కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలోనే ఉమాభారతితో సహా అనేక మంది సీఎంల మీద కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ, ఇంకా ఉంది అని చెప్పుకోవడం కోసమే ఇదంతా డ్రామా ఆడుతున్నారని చెప్పారు. కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీని తిట్టడమే నీ(చంద్రబాబు) రాజకీయానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఏపీ ఇంటెలిజెన్స్‌ను వాడుకుని చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణాకు అనుకూలం అని ఆయనే అంటాడు..వ్యతిరేకం అని ఆయనే అంటాడు..తెలంగాణాకు, చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment