
అహ్మదాబాద్ : పార్టీలోకి వస్తే రూ. కోటి ఇస్తామని, అడ్వాన్సుగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తనకు రూ.10 లక్షలు ఇచ్చిందని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) కన్వీనర్ ఆరోపించారు. త్వరలో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీపై ఈ తరహా ఆరోపణలు రావడం నష్టదాయకమే.
హార్థిక్ పటేల్‌కు సన్నిహితుడైన వరుణ్ పటేల్ శనివారం బీజేపీలో చేరారు. ఆ మరుసటి రోజే బీజేపీలో చేరేందుకు తనకు రూ.కోటి ఇవ్వజూపారని, అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇచ్చారని.. ఆ డబ్బు ఇదేనని(మీడియా సమావేశంలో చూపుతూ) నరేంద్ర పటేల్ చెప్పారు. రూ.కోటి కాదు, మొత్తం రిజర్వ్ బ్యాంకును తన పేరు మీద రాసిస్తానన్నా.. పీఏఏఎస్‌ను వీడనని పేర్కొన్నారు.
నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ పటేల్ ఖండించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై బీజేపీపై ఈ ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఆ డబ్బు బీజేపీ ఇచ్చిందనడానికి ఆధారాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, నరేంద్ర పటేల్ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించాల్సివుంది. సోమవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పీఏఏఎస్ నాయకుడు హార్థిక్ పటేల్‌ను కలిసే అవకాశం ఉంది.