
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచమంతా భారత్‌కు అనుకూలంగా ఉంటే.. దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్క దేశ ప్రధానిని కొనియాడటంలో బిజీగా ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిట్ పాత్రా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ.. ‘మన ప్రధాని ఇమ్రాన్ చూసి నేర్చుకోవాలి’ అని చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలను జోడించారు. ఉద్రికత్తల మధ్య కాంగ్రెస్ పార్టీ పాక్ జెండాను, ప్రధానిని ప్రమోట్ చేయడంలో ఎందుకు బిజీగా ఉందో అర్థం కావడం లేదని ట్వీట్‌లో అసహనం వ్యక్తం చేశారు.
పాక్ చెరలో ఉన్న భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుండగా.. కొందరు మాత్రం ఇమ్రాన్ ఖాన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు. భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్.. ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. శాంతిస్థాపనలో తొలి అడుగుగా భారత పైలట్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment