సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కొందరు నేతలను మా దగ్గరికి పంపి మీడియాకు లీకులిస్తున్నారు. ఇలా చేసి ప్రజలను కన్‌ఫ్యూజ్ చేయొద్దు. చంద్రబాబు తల కిందులుగా తపస్సు చేసినా మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు. మా దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు. ఆయన చేసిన ద్రోహం బీజేపీ ఎప్పటికీ మర్చిపోదు. చంద్రబాబుకు మేం 240 కిలోమీటర్లు దూరంగా ఉంటాం. ప్రస్తుతం టీడీపీ లిమిటెడ్ కంపెనీగా మారి నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలే ఆ పార్టీని ఏలారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీది ముగిసిన అధ్యాయం. చంద్రబాబు, లోకేశ్‌లు తప్ప ఏ బలమైన నాయకుడు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తాం. గంటా శ్రీనివాసరావు బీజేపీ అగ్రనాయకత్వంలో చర్చలు జరపుతున్నారేమో నాకు తెలియదు. చంద్రబాబు ఎన్ని దీక్షలైనా చేసుకోవచ్చు. ఆయన దీక్షకు మేం సంఘీభావం మాత్రమే తెలియజేశాం తప్ప కార్యక్రమంలో పాల్గొనడం లేద’ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment