
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 120కిపైగా సీట్లు గెలుపొందడం ఖాయమని, కావాలంటే ఈ విషయాన్ని రాసి ఇస్తానని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్టు యెడ్డీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వస్తాయంటూ అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ తప్పు అని యడ్యూరప్ప కొట్టిపారేశారు. ‘ప్రజలందరి సహకారంతో మేం 125-130 సీట్లు గెలుపొందుతాం. కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలకు మించి రావు. జేడీఎస్‌కు 24-25 సీట్లే వస్తాయి. ఇవి నా అంచనాలు. ఇప్పటివరకు నా అంచనా ఎప్పుడు తప్పు కాలేదు’ అని ఆయన ఆదివారం విలేకరులతో అన్నారు.
‘నేను కర్ణాటక రాజకీయాల్లో చాలాకాలం నుంచి ఉన్నాను. ఎన్నికల సందర్భంగా కర్ణాటక మొత్తం పర్యటించాను. మీరు కావాలంటే రాసి కూడా ఇస్తాను. ఫలితాలు వచ్చిన తర్వాత నేను రాసి ఇచ్చిన దానితో పోల్చుకోండి’ అని ఆయన చెప్పారు. ఈ నెల 17న తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానించినట్టు పేర్కొన్న యెడ్డీ.. మళ్లీ అధికారంలోకి వస్తానని సిద్దరామయ్య కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.