సాక్షి, హైదరాబాద్ : కాగ్ నివేదికలో పోలవరం అవినీతి బట్టబయలు అయిందని పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని నేరుగా కాగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే అవినీతి ఆరోపణలు చేసిందని అన్నారు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మాట్లాడారు. పోలవరం, పట్టిసీమ అవినీతిని కాగ్ తప్పుపట్టిందని, పట్టిసీమ అవసరం లేదని కాగ్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. పోలవరం పనులపై థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్ లేదని, క్వాలిటీ ఆడిట్ కూడా జరగలేదని ఆరోపించారు. ఇంతవరకు అంబుడ్స్‌మెన్‌ను నియమించలేదన్నారు. పోలవరం కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని, పోలవరం డిజైన్లు, డ్రాయింగ్ ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని బుగ్గన ప్రశ్నించారు.
పోలవరం భూ సేకరణ సక్రమంగా జరగలేదని కాగ్ తేల్చిందని, 96 శాతం పునరావాసం ఇవ్వలేదని చెప్పిందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి, దీని నిర్మాణం కూడా కేంద్రమే చూసుకుంటే బాగుంటుందని బుగ్గన సూచించారు. ప్రత్యేక హోదా వస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని తెలిపారు. ప్రస్తుతం 40 ప్రాజెక్ట్‌ల నిర్మాణం నడుస్తున్నాయని, పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతుందని, కానీ ఎలా పూర్తి చేస్తుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల మేలు కోసమే అన్ని ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయాలను ఏపీ ప్రభుత్వం వందశాతం పెంచేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు స్టీల్, సిమెంట్ ప్రభుత్వమే ఎందుకు ఇస్తుందని.. టెండర్ విధానం ఎందుకు పెట్టారని బుగ్గన ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువగా రూ.1800 కోట్లు అదనంగా ఇచ్చారని పేర్కొన్నారు. పోలవర నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎందుకు స్పష్టత తీసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరంపై అసలు మానిటరింగ్ లేదని, 24 సార్లు సమావేశం కావాల్సిన మానిటరీ కమిటీ, రెండు సార్లు మాత్రమే సమావేశమైందని బుగ్గన ఆరోపించారు. సామాన్యులు కట్టిన, కడుతున్న పన్నులను దుర్వినియోగం చేస్తున్నారని, మీ అవినీతికి నిదర్శనం పోలవరంపై చేసిన ఖర్చేనని అన్నారు. బాబు హయాంలో లక్షా 50వేల కోట్ల అప్పు చేశారని బుగ్గన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment