హలో గురూ ఓటు కోసమే..! | Candidates campaign through Messages, voice calls | Sakshi
Sakshi News home page

హలో గురూ ఓటు కోసమే..!

Published Wed, Oct 24 2018 2:12 AM | Last Updated on Wed, Oct 24 2018 9:29 AM

Candidates campaign through Messages, voice calls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు, అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. నేటి స్మార్ట్‌యుగంలో ప్రచారం కూడా స్మార్ట్‌గానే చేస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, వాయిస్‌ కాల్స్‌తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకటి, రెండు పార్టీలు మినహా ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయినా, టికెట్‌ వస్తుందనే ఆశతో ఉన్నవారు అభ్యర్థుల పేర్లతో బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అంటూ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లోని ఓటర్లకు సందేశాలు పంపారు. 2014 ఎన్నికల్లోనే చాలామంది అభ్యర్థులు ఈ విధానంలో కూడా ప్రచారం చేసుకున్నారు.

అయితే, అభ్యర్థులు, ఆశావహుల చేతికి తమ ఫోన్‌ నంబర్లు ఎలా వెళుతున్నాయన్నది పౌరులకు అంతుచిక్కడంలేదు. వారికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా లేకున్నా టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌ వెళుతుండటం గమనార్హం. ప్రధానంగా గ్యాస్‌ ఏజెన్సీలు, కేబుల్‌ ఆపరేటర్లు, బ్యాంకులు, షాపింగ్‌మాల్స్, టౌన్‌షిప్, అపార్ట్‌మెంట్‌ ఆఫీసులు, ఓటరులిస్టుల ద్వారా ఫోన్‌ నంబర్లను కొందరు అక్రమంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీలు రేటు కట్టి ఫోన్‌ నంబర్ల జాబితాలను విక్రయిస్తున్నారు. అభ్యర్థులు వీటిని వివిధ సర్వీస్‌ ప్రొవైడర్లకు అందజేసి ఆ నంబర్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే, పోటీచేసే వ్యక్తి ఇంటింటికీ తిరిగినా ఓటర్లందరినీ కలిసే అవకాశాల్లేవు. అందుకే ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. బల్క్‌ మెసేజ్‌ ప్యాకేజీలు రోజుకు రూ.వెయ్యి నుంచి ఆపై వరకు ఉన్నాయి. ఇంటర్నెట్‌ సాయంతో రోజుకు వేలాది సందేశాలు పంపే వెసులు బాటు కూడా ఉంది. అయితే ఫోన్‌ కాల్‌కి మాత్రం రూపాయి నుంచి రూ.5 వరకు చార్జీ చేస్తున్నారు. ఆ లెక్కన రోజుకు 30 నుంచి 40 వేల ఫోన్లకు వాయిస్‌కాల్స్‌ పంపే వెసులుబాటు ఉంది. వీటి ప్యాకేజీలు రూ.50 వేల నుంచి ఉన్నాయి. ఈ లెక్కన 119 నియోజవర్గాల్లో అభ్యర్థులు, రెబెల్స్‌ అంతా కలుపుకుంటే ఈ లిస్టు చాంతాడంత అవుతుంది. అంతా ఇదే విధానాన్ని అనుసరిస్తే ఆ వ్యయం రూ.కోట్లల్లో ఉంటుంది.


నామినేషన్‌ వేసే దాకా..
తాము పోటీలో ఉన్నామని వారి పార్టీల అధిష్టానాలకు, తమ ప్రత్యర్థులకు చాటుకోవాలన్న తాపత్రయంలో, గెలుపుపై ధీమాను చాటేందుకు ఆశావహులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏదో ఒక పార్టీపై బీ–ఫారం సంపాదించి నామినేషన్‌ వేసే వరకు అది అతని వ్యక్తిగత ప్రచారమే అవుతుంది. అయితే, ఈ ప్రచారానికి వీరు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపెడతారా? లేదా.. అన్నది సందేహమే.

అనుమతి లేకుండా ఫోన్‌ చేయడం, మెసేజ్‌లు పంపడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పోలీసులు, న్యాయనిపుణులు అంటున్నారు. దీనిపై వినియోగదారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జనాభాలో 40 శాతం యువత ఉంది. సోషల్‌మీడియాలో ఒక్కొక్కరికి రెండు, మూడు ఖాతాలున్నాయి. అందుకే, వారిని చేరుకునేందుకు పార్టీలు, నేతలు సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement