కేబినెట్ వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పియూశ్ గోయల్
న్యూఢిల్లీ: 2019 ఎన్నికలకు ముందు రైతులకు లబ్ధి చేకూర్చే మరో పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 2022 వరకు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో భాగంగా.. రైతులకు మద్దతు ధర భరోసా కల్పించే రూ.15,053 కోట్ల విలువైన సేకరణ విధానాన్ని కేంద్రం ప్రకటించింది. దీంతోపాటుగా ధాన్యాల కొనుగోలు విషయంలో రైతులకు లాభం జరిగేలా సేకరణ జరగాలని, ఇందుకోసం అవసరమైతే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించాలని రాష్ట్రాలకు సూచించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ (ఆదాయం) సంరక్షణ్ అభియాన్’ (పీఎం ఆశ)కు ఆమోదం లభించింది. ‘2018 బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర పొందేలా చూడటమే ఈ ‘పీఎం ఆశ’ విధానం లక్ష్యం. ఇదో చారిత్రక నిర్ణయం’ అని కేబినెట్ భేటీ వివరాలను వెల్లడిస్తూ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. ‘పీఎం ఆశ’ విధానంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు.. ఎమ్మెస్పీ (కనీస మద్దతు ధర) కన్నా తగ్గినపుడు ధాన్యాన్ని సేకరించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వాలు మూడు పథకాల్లో (ప్రస్తుత మద్దతు ధర – పీఎస్‌ఎస్, కొత్తగా రూపొందించిన ధరల కొరత చెల్లింపుల పథకం – పీడీపీఎస్, ధాన్య సేకరణ ప్రైవేటు వ్యాపారుల పథకం పైలట్ – పీపీఎస్‌ఎస్) ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
సేకరణ క్రెడిట్ లైన్ పెంపు
పీఎం ఆశ పథకాన్ని అమలుచేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ.15,053 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. సేకరణ సంస్థలకు ఇచ్చే క్రెడిట్ లైన్‌కు ప్రభుత్వ హామీని రూ. 16,550 కోట్లు పెంచింది. దీంతో ఈ క్రెడిట్ లైన్ మొత్తం రూ.45,550కి చేరింది. ఈ కొత్త విధానం ప్రకారం.. రాష్ట్రాలకు ప్రస్తుత మద్దతుధర పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం కేంద్ర ఏజెన్సీలు.. వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు తగ్గినపుడు కూడా ఎమ్మెస్పీని రైతులకు చెల్లించే అవకాశం ఉం టుంది. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ అమలుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు
► దేశవ్యాప్తంగా 13,675 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ.12,134.5 కోట్ల విడుదలకు పచ్చజెండా ఊపింది. 2021–22 కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది.
► దేశవ్యాప్తంగా మరో 4 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఎన్‌ఐడీ చట్టం– 2014కు సవరణలను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుం ది. అమరావతి (ఏపీ), భోపాల్ (మధ్య ప్రదేశ్), జోర్హాట్ (అస్సాం), కురుక్షేత్ర (హరియాణా)ల్లో ఏర్పాటుచేయనున్న ఎన్‌ఐడీలకు జాతీ య ప్రాముఖ్య సంస్థల హోదా కల్పిస్తారు.
ఇథనాల్ ధర 25% పెంపు
దేశవ్యాప్తంగా పెట్రో మంట రాజుకున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరను 25% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటర్ ఇథనాల్ ధర రూ.47.13 ఉండగా.. దీన్ని రూ.59.13కి పెంచనున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా చక్కెర రైతులకు లబ్ధి జరగనుంది. ఇథనాల్ ధరను పెంచడం ద్వారా చక్కెర మిల్లులకు లాభం పెరిగి.. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు వీలవుతుంది. చక్కెర మిల్లుల ద్వారా రైతులకు రూ.13వేల కోట్ల బకాయిలున్నాయి. ఇందులో 40% యూపీలోనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో 4–5% ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలు పుతుండగా.. వచ్చే నాలుగైదేళ్లలో దీన్ని 10%కు పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment