
సాక్షి, హైదరాబాద్ : ప్రజాగాయకుడు గద్దర్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలువడం తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. వామపక్ష రాజకీయాలతో మమేకమైన గద్దర్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి గద్దర్ తీరుపై ఒకింత పెదవి విరిచారు. గద్దరన్న మహాకూటమికి మద్దతునిస్తున్నానని చెప్పటం మంచి పరిణామమేనన్న చాడా.. ఆయన రాహుల్, సోనియాలను కలిసేముందు మహాకూటమి భాగస్వామ్య పార్టీలతో మాట్లాడుంటే బాగుండేదంటూ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పెద్దలను కలిసే ముందే మహాకూటమి భాగస్వామ్య పక్షాలతో గద్దర్ ఒక అవగాహనకు వచ్చింటే ఆయనకే గౌరవంగా ఉండేదని చెప్పారు. మహాకూటమితో అవగాహనలో ఉన్న పార్టీలను కనీసం నామమాత్రంగానైనా కలువకుండా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవటం బాధాకరమంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదిఏమైనా బ్యాలెట్ విలువ గుర్తించి ఓట్ల ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని గద్దర్ గుర్తెరుగడం సంతోషకరమని చెప్పుకొచ్చారు.