తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్న రాజ్యసభ మాజీ ఎంపీ చందన్ మిత్రా
కోల్‌కతా : సీనియర్ జర్నలిస్ట్, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన చందన్ మిత్రా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈనెల 21న మిత్రా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిత్రా బీజేపీ చీఫ్ అమిత్ షాకు తన రాజీనామా లేఖను అందచేశారని, ఈనెల 21న ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని మిత్రా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జులై 21న తృణమూల్ భారీఎత్తున షాహిద్ దివస్‌ను నిర్వహించనున్న క్రమంలో బెంగాల్ సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో మిత్రా ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి సన్నిహిత సహచరుడిగా పేరొందిన మిత్రా నరేంద్ర మోదీ- అమిత్ షా ద్వయం తనను పక్కనపెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
పయనీర్ పత్రిక ఎడిటర్ అయిన చందన్ మిత్రా 2003 నుంచి 2009 వరకూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2010లో మరోసారి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీతో పలు అంశాల్లో ఇటీవల మిత్రా విభేదించడంతో సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు ఆయనను ట్రోల్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment