అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు : చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం మైదుకూరు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ భారత జాతి యావత్తుకు ఈ రోజు నిజమైన పండుగ అని అన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలోనే మనమందరం నడుస్తున్నామని, ఈ జాతికి దిశ, దశ నిర్మించింది ఆయనేనన్నారు. చక్కటి ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసిన ఘనత ఆ మహానుభావుడిదేనని తెలిపారు. మంచి ఆశయాలతో రూపకల్పన చేసిన రాజ్యాంగం నేడు కొన్ని ప్రభుత్వాలు, కొందరి నేతల వల్ల పలుమార్లు మరణిస్తోందన్నారు.
నిజంగా ఈ రాష్ట్రంలో జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు అంబేడ్కర్ ఆత్మ ఎన్నో మార్లు ఘోషించి ఉంటుందన్నారు. స్వయంగా చంద్రబాబే ఎస్సీ, ఎస్టీ కులంలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారంటే అది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రి ఆది దళితులు అపరిశుభ్రమైన మనుషులని, వారు మారరని మాట్లాడి దళిత జాతిని అవహేళన చేశారన్నారు.ఈ నాయకులకు దళిత ఓట్లు మాత్రం కావాల్సిందేనన్నారు. సింహాసనం ఎక్కడానికి, ఊగడానికి వారి అవసరం మాత్రం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దళితులు సమాజంలో అభివృద్ధి చెందలేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవితాలు పూర్తిగా మారకపోవడం పట్ల విచారం, బాధను వ్యక్తం చేస్తున్నానన్నారు.
నేటికీ దళితులు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీ«ధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయిల్‌మిల్ ఖాజా, దాదాపీర్, జాఫర్, రఫి, సోములవారిపల్లె శేఖర్, ఎంపీటీసీ సభ్యుడు ఓబుళరెడ్డి, వెల్లాల భాస్కర్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మల్లికార్జున ప్రసాద్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, జింకా విజయలక్ష్మి, రాచంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు
చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ పరాయి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనుగోలు చేయడంతోపాటు వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులకు అంబేడ్కర్ లాంటి గొప్ప నేతల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అర్హులకు దక్కాల్సి ఉందన్నారు. ఇది రాజ్యాంగ హక్కు అని తెలిపారు. అయితే చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అర్హులను పక్కనపెట్టి అనర్హులకు లబ్ధి చేకూర్చుతున్నారని విమర్శించారు. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం రూ.కోట్లు ఖర్చు చేసి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో వరుసగా అనేక చోట్ల దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జానకి పేట గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలిచారని టీడీపీ నేతలు దళితులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. తాజాగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడినా ప్రభుత్వం మాత్రం కేసులు నమోదు చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment