రీడిజైన్ల పేరుతో కమీషన్లు !  | Commissions in the name of Re Designs | Sakshi
Sakshi News home page

రీడిజైన్ల పేరుతో కమీషన్లు ! 

Published Mon, Sep 2 2019 1:23 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Commissions in the name of Re Designs - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చిత్రంలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ తదితరులు

కొందుర్గు: కేసీఆర్‌ సర్కార్‌ రీ–డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తూ కమీషన్లకు కక్కుర్తి పడుతుందే తప్ప రైతు ప్రయోజనాల కోసం ఆలోచించడం లేదని.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు జలసాధన సమావేశం పేరుతో ఆదివారం రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌చౌదరిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ఆదివారం ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాణహిత చేవెళ్లకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. ప్రాణహిత–చేవెళ్లతోనే ఈ ప్రాంతానికి తక్కువ ఖర్చుతో సాగునీళ్లు అందేవన్నారు. గోదావరి జలాలతో సాగునీరు అందడం సాధ్యంకాదని.. కేసీఆర్‌ కృష్ణా జలాలతో లక్ష్మీదేవిపల్లి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తామని ఇక్కడి ప్రజలను నమ్మించి అధికారం చేపట్టాక పట్టించుకోవడం లేదన్నారు. మొన్న పాలమూరు ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌ నోట లక్ష్మీదేవిపల్లి మాట వినిపించకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టు సాధనకోసం ఇక్కడి ప్రాంత ప్రజల వెంట కాంగ్రెస్‌ ఉంటుందన్నారు. జూన్‌లో ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇంకా దిక్కులేదని, రుణమాఫీని విస్మరించారని ధ్వజమెత్తారు. నిజాం పాలన నుంచి విముక్తి కల్పించడానికి కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ పార్టీలు గతంలో పోరాటం చేశాయన్నారు. 

కేసీఆర్‌కు సమాధి కడతాం 
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మించకుంటే కేసీఆర్‌కు సమాధి కట్టడం ఖాయమని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రారంభమైందన్నారు. అవి లేకపోవడంతోనే కాలిపోతున్న మోటార్లు, ఎడారులుగా మారిన పంటపొలాలతో వలసబాటపడుతున్న పాలమూరు బిడ్డల్ని చూపించి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. ఆనాడు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ కర్ణాటక నుంచి పాలమూరు జిల్లాకు నీళ్లు రావడం లేదని, ఆలంపూర్‌ నుంచి గద్వాల వైపు మొట్టమొదట కేసీఆర్‌ పాదయాత్ర చేపట్టి పాలమూరుకు సాగునీళ్లు వస్తే ఇక్కడి ప్రజలు పెరుగన్నం తినవచ్చని నమ్మించారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 13 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇక్కడి ప్రజలు గెలిపించారని తెలిపారు. అమాయకులైన పాలమూరు బిడ్డలను నట్టేట ముంచి ఈనాడు పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి, ఎండబెట్టడానికి యత్నిస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. ‘ఓరి సన్నాíసీ నాగార్జున సాగర్, శ్రీశైలం, కొమరంభీం, కోయిల్‌సాగర్, ఎల్లంపల్లి, కల్వకుర్తి, శ్రీరాంసాగర్, నెట్టెంపాడ్, భీమా దేవాదుల ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాజెక్టులు నిర్మించి 60 లక్షల ఎకరాలకు కాంగ్రెస్‌ పార్టీ సాగునీరు ఇచ్చిందని మరిచిపోయావా?’అని కేసీఆర్‌ను విమర్శించారు. నల్లమల రత్నాలు, యురేనియం దోచుకోవడమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. 

వైఎస్సార్‌ హయాంలోనే ప్రాణహిత 
కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ హయాంలోనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రణాళిక వేసిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అప్పట్లో కొనుగోలు చేసిన మోటార్లను ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు సాగు, తాగు నీరు దిక్కు లేకున్నా, గోదావరి జలాలతో రాయలసీమను రతనాలసీమ చేస్తానని కేసీఆర్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వైఎస్సార్‌ సాక్షిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో నాయకులు కుసుమకుమార్, చంద్రశేఖర్, బోసురాజ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, సంపత్‌కుమార్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement