
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కేవలం ఓ కుటుంబ పార్టీగా మిగిలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మంగళవారం వ్యాఖ్యానించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం బీజేపీ మోర్చా కన్వీనర్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మాజీ సైనికులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్‌గాంధీ వారసత్వంగా అధ్యక్షుడు అయ్యాడన్నారు. దేశ సైనికులు పాకిస్తాన్‌తో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ ప్రతినిధులతో రహస్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ రక్షణ, సమగ్రత కోసం బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు.