
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల బహిష్కరణ, సస్పెన్షన్ వేటుపై ఆ పార్టీ భగ్గుమంది. అధికారపక్షం తీరును తప్పుబడుతూ పోరాటానికి దిగింది. ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’అంటూ నినదించింది. శాసన సభ్యత్వంపై వేటుపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరుతో 48 గంటల నిరాహార దీక్షకు దిగారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డితో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు సంఘీభావం ప్రక టించారు. దీంతో నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెంది న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ్యనేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రజాగ్రహాన్ని చూడకతప్పదని పేర్కొన్నారు.
పోరాటం మొదలైంది: ఉత్తమ్
అధికార పార్టీ హామీల అమల్లో విఫలమైందని.. దానిపై నిలదీసినందుకే ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి బయటికి పంపిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఇష్టమున్నట్లు నాటకాలు ఆడుకోవచ్చనే ఉద్దేశంతోనే.. అకారణంగా ఇద్దరి సభ్యత్వాలను రద్దు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఇక ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య పోరాటం మొదలైనట్లే.
స్వామిగౌడ్ మీద దాడి జరిగిందని ఒక డ్రామాకు తెరలేపారు. ఆయనపై దాడి జరిగిందనేది నాటకం. అదే నిజ మైతే దాడి జరిగిందంటున్న వీడియోలను ఎందుకు విడుదల చేయలేదు..’’అని నిలదీశారు. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని స్పీకర్.. ఎలాంటి కారణాలు లేకుం డా ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’ అని పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్‌కు చరమగీతమే..
ప్రజా సమస్యలపై నిలదీస్తున్నామనే.. కాంగ్రెస్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. దేశంలో ఏ శాసనసభలోనూ ఇలా సభ్యత్వాలను రద్దు చేయలేదని మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ దీక్షకు అందరూ సంఘీభావం తెలపాలని కోరారు. శాసనసభలో ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెప్పారు.
గవర్నర్ ప్రసంగంలో దళిత సీఎం, మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ వంటి అంశాలు లేకపోవడంతో నిరసన తెలిపామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎం కావడంతోనే తెలంగాణలో ప్రమాదంలో పడిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చేయని తప్పుకు కోమటిరెడ్డి, సంపత్‌లపై అనర్హత వేటు వేయించారన్నారు.
ప్రాణం పోయినా సరే.. కేసీఆర్ ఓటమే నా లక్ష్యం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రాష్ట్రంలో నియంత పాలన సాగు తోందని.. దానిని దేశానికి తెలియజెప్పేందుకే దీక్ష చేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ‘‘ప్రాణం పోయినా సరే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశాను. కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయం. స్వామిగౌడ్‌కు గాయాలయ్యాయనేది కట్టుకథ.
పొద్దున ఒక కన్నుకు సాయంత్రం ఇంకో కన్నుకు చికిత్స చేయించుకుంటున్నారు. సభలో నిరసన తెలిపిన దృశ్యాలు చూపుతున్నారుగానీ.. స్వామిగౌడ్‌కు అయిన గాయాలు ఎందుకు చూపట్లేదు. ప్రజా సమ స్యలు, రాజకీయ హత్యలపై నిలదీస్తామనే మమ్మల్ని బహిష్కరించారు..’’అని పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యత్వం రద్దు చేసినా.. తమకు నాలుగు కోట్ల మంది ప్రజల గుండెల్లో సభ్యత్వం ఉందని సంపత్ పేర్కొన్నారు. ఆ నాలుగు కోట్ల మంది ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
దాడి బూటకం.. కేసీఆర్ నాటకం
అసెంబ్లీలో జరిగిందంటున్న దాడి బూటకమని.. అంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులపై బహిష్కరణ, సస్పెన్షన్ వేటు అనంతరం సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టి, జీవన్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని బయటకు పంపించాక ఇక అసెంబ్లీ ఎందుకని.. ప్రగతిభవన్‌కో, ఫామ్‌హౌజ్‌కో మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేయవచ్చని, కేసీఆర్ కుమార్తె స్పీకర్ మొహంపై ప్లకార్డులు పెట్టినా ఏమీ కాదని... తాము మాత్రం పోడియంలోకి వెళితే సభ నుంచి బయటకు పంపిస్తారా అని ప్రశ్నించారు. గతంలో బెంచీలపై నుంచి, మార్షల్స్ భుజాల మీద నుంచి దూకి గవర్నర్‌పై దాడికి పాల్పడ్డ మంత్రి హరీశ్‌రావు.. ఇప్పుడు తమను సస్పెండ్ చేస్తూ తీర్మానం పెట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.