
పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో..
హైదరాబాద్: తల తెగిపడ్డా తెలంగాణ సీఎం కేసీఆర్ అక్రమాలపై మాట్లాడతానని, నీ కర్మ కాలిన రోజున నువ్వు(కేసీఆర్) ఊచలు లెక్కపెడతావని అప్పుడు నరేంద్ర మోదీ కూడా ఆపలేడని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి శాపనార్ధాలు పెట్టారు. మంగళవారం ఈడీ విచారణ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. రేపు కూడా మళ్లీ విచారణకు రమ్మన్నారని వెల్లడించారు. రేపు కూడా విచారణకు హాజరై అన్ని సమాధానాలు చెబుతానన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాసనసభ ఎన్నికలపుడు ఐటీ అధికారులను ప్రయోగించారని, పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈడీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లది ఫెవికాల్ బంధమని అన్నారు. ఎంఎల్‌సీ ఎన్నికలప్పుడు ఏసీబీని ప్రయోగించి కేసీఆర్ గెలిచారని, మొన్న జరిగిన ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్దీ విచారిస్తున్నారని అన్నారు. చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరుపుతున్నారని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత మూడో కృష్ణుడు ఈడీ ఏం తేల్చుతాడని వ్యంగ్యంగా మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి కుమారులను ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని పిలిచి వారి కుటుంబసభ్యులపై ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్న కొద్ది మంది పెద్దలు చేస్తున్న ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని కోరారు. కొడంగల్‌లో నా పై పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి వద్ద రూ.51 లక్షల నగదు దొరికాయని, దానిపై ఈడీ, సీబీఐతో ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌లపై వ్యతిరేకంగా పోరాడుతున్న వారినే దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్, పనికిమాలినోళ్లను మంత్రులుగా పెట్టుకున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు.