మంగళవారం జైలులో కాంగ్రెస్ నేతలు, విద్యార్థులను పరామర్శించి వస్తున్న ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని జైలుగా మార్చి సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎన్నో త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఇందుకేనా? అని పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఓయూ విద్యార్థి మురళి ఆత్మహత్య సందర్భంగా అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మానవతా రాయ్, దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, టీడీపీ నేత ప్రతాపరెడ్డిని చంచల్‌గూడ జైలులో ఉత్తమ్ మంగళవారం పరామర్శించారు. పీఏసీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డి, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, లీగల్‌సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డితో కలసి ఉత్తమ్ ములాఖత్‌లో కలిశారు.
పరామర్శకు వెళితే అరెస్టులా..?
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణను పోలీసు నిర్బంధంలో పెట్టారని, రాష్ట్రంలో ఇలాంటి రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని చెప్పారు. ఉద్యోగం రావడం లేదనే బెంగతో ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి దగ్గరకు వెళితే అరెస్టు చేసి నేతలను జైలులో పెట్టే అప్రజాస్వామిక, అరాచక పాలన మన రాష్ట్రంలో ఉంటుందని ఊహించలేదని అన్నారు. అరెçస్టు చేసిన వారికి కనీసం కోర్టులో హాజరుపర్చకుండా, నేరుగా చంచల్‌గూడ జైలులో పెట్టారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి అణిచివేతను కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుందని, మురళి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరపర్చకుండా జైలులో పెట్టిన అప్రజాస్వామిక చర్యపై కోర్టుకు వెళ్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఖాళీలనే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో భర్తీ చేయలేదని, డీఎస్సీ వేయడం లేదని, టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు అన్నీ నవ్వులాటగా చేస్తూ, నిరుద్యోగుల జీవితా లతో ఆడుకుంటోందని ఉత్తమ్ విమర్శిం చారు. ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యంతో యువతలో నైరాశ్యం నెలకొందన్నారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌దే ప్రత్యక్ష బాధ్యత అని అన్నారు.
టీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షునిగా చేస్తారా: శ్రవణ్
బీసీలకు ఏదో చేస్తున్నామని రెండు రోజులపాటు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షునిగా చేస్తారా? అని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ గొర్రెలు, బర్రెలు ఇచ్చి రాజ్యాధికారాన్ని సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చెలాయిం చాలనే కుట్రతోనే ఇలాంటి కొత్త డ్రామా లకు తెరతీశారని ఆరోపించారు. బీసీలకు విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాజ్యాధి కారంలోనూ జనాభా నిష్పత్తి ప్రకారం వాటా కావాలన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తా అంటూ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ మాట్లాడు తున్నారని, కాంగ్రెస్‌ను లేకుండా చేయడం వాళ్ల ముత్తాత తరం కూడా కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment