సాక్షి, నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్), రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్‌ఎస్ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. తాజాగా నకిరేకర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడైన చిరుమర్తి.. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నాడనే ప్రచారం తీవ్రచర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికి టికెట్ నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి మరి టికెట్ ఇప్పించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయనను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రావడంలేదు. చిరుమర్తి, ఆయన సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
ఇంతటి నమ్మకద్రోహమా?
ఇక చిరుమర్తి పార్టీ మారుతున్నాడనే వార్తలపై మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిచారు. ఇంతటి నమ్మకద్రోహం చేస్తారనుకోలేదని, పార్టీ మారే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వార్తల ద్వారనే తెలుసుకొని ఆశ్చర్యపోయానన్నారు. రెండు సార్లు టికెట్ ఇప్పించి ఆయన గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇక చిరుమర్తి పార్టీ మారడంతో జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment