
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షుగా మారింది. బలహీన నాయకత్వం.. సమన్వయం లేకపోవడం.. కొత్త తరాన్ని పాత నాయకత్వం ఎదగనీయకపోవడం వంటి కారణాలు ఓ వైపు, పట్టింపు లేని ధోరణి.. పలుకరించే నేతలు కరువైపోవడం వంటివి మరోవైపు వెరసి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. వారిలో 12 మంది అధికార పార్టీ కండువాలు కప్పుకోవడంతో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతైంది.
శాసనమండలి విలీనం తర్వాత శాసనసభ విలీనం దిశగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతున్నా, ఢిల్లీ అధినాయకత్వం చూసీచూడనట్లే వ్యవహరించడం, లోక్‌సభ ఎన్నికల వ్యవహారాల్లో పార్టీ సీనియర్లు బిజీగా ఉండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరుగురు సభ్యులకే పరిమితం కావాల్సిన అగత్యం ఏర్పడింది. ఇందులోనూ ఎందరు ఉంటారో, ఎందరు పార్టీ వీడతారో తెలియని అయోమయంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది.
పంచాయతీ నుంచి ఇంతే...
శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గ్రామస్థాయి నేతలను పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో మరికొందరు కార్యకర్తల ఒత్తిడితో పార్టీలు మారారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధినేతలు బిజీగా ఉండటం, ఎమ్మెల్యేలకు వారి అపాయింట్‌మెంట్‌లే దొరక్కపోవడంతో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో సమన్వయం లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అలిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు లేకపోవడంతో రేగ కాంతారావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో తన కుమారుడికి బదులుగా టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారు.
కొందరు ఎస్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని సంకేతాలు ఉన్నప్పటికీ, వారితో చర్చించి ఆపడంలో పార్టీ పూర్తిగా విఫలమైంది. జాజాల సురేందర్, చిరుమర్తి లింగయ్య వంటి వారు పార్టీ మారుతున్నా, వారి ఇంటికి వెళ్లి బుజ్జిగించిన యత్నాలేవీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోని మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హరిప్రియ (ఇల్లందు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.
తాజాగా శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరడంతో మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లయింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా గెలుపొందడంతో ఆయన హుజూర్‌నగర్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పార్టీ విలీనం పూర్తయిన నేపథ్యంలో వీరిలో ఎంతమంది ఉంటారో అనే చర్చ జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి ఝలక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని గాంధీభవన్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
చివరి నిమిషంలో కోర్టుకు..
ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ పార్టీ మారి విలీన ప్రక్రియకు పూనుకున్నా, అప్పట్లోనే పీసీసీ నేతలు దాన్ని పలు వేదికలపై ప్రశ్నించినా, కోర్టులో సవాల్ చేయలేదు. ఇక ఆత్రం సక్కు, రేగ కాంతారావు పార్టీ మారిన సమయంలో కేవలం అసెంబ్లీ ముందు నిరసనలకు దిగడం తప్ప న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించడంలో జాప్యం చేసింది. చివరి నిమిషంలో హైకోర్టును ఆశ్రయించినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మొత్తానికే ఎసరు రావడంతో మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరి ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఎన్నో కారణాలు...
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోవడానికి అనేక కారణాలున్నాయి. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో లోపం స్పష్టంగా కనిపించింది. టికెట్ల కేటాయింపులు, పొత్తులు, ప్రచార వ్యూహం లేక ఎన్నికల్లో బొక్కాబోర్లా పడింది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్‌లో నైతిక స్థైర్యం నింపే చర్యలేవీ టీపీసీసీ చేపట్టలేదు. ఓటమికి కారణాలేమిటో అధ్యయనం చేయలేదు. ఇక పార్టీ మనుగడ కష్టమన్న అభిప్రాయంతో ఉన్న నేతలను టీఆర్‌ఎస్ అక్కున చేర్చుకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్ పార్టీ మారారు.
ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, దామో దర్‌రెడ్డిలతో కలిసి శాసనమండలి పక్షాన్ని విలీనం చేయాలని మండలి చైర్మన్‌ను కలిసే వరకూ టీపీసీసీ పసిగట్టలేకపోయింది. దీనిపై తేరుకుని విలీనంపై ప్రజాక్షేత్రంలో పోరాడే సమయానికే కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటన వచ్చేసింది. దీంతో మండలిలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగలారు. వారి పదవీ కాలం కూడా ముగిసింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపుతో ప్రస్తుతం మండలిలో ఒక్క సభ్యుడే కాంగ్రెస్‌కు మిగిలారు. ఇక మండలిలో వ్యూహాన్నే శాసనసభలోనూ టీఆర్‌ఎస్ అమలు చేస్తుందని తెలిసినప్పటికీ, పార్టీ నాయకత్వం తగిన విధంగా వ్యవహరించడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment