
సెల్‌ఫోన్ బ్యాన్ ప్రతీకాత్మక చిత్రం
లక్నో: అత్యాచారాలపై యూపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యువతులు సరైన దుస్తులు వేసుకోకపోవటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రామ్‌శంకర్ విద్యార్థి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రామ్‌శంకర్ విద్యార్థి సోమవారం బల్లియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ హాజరైన స్టూడెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ‘అమ్మాయిలు మీ బట్టల విషయంలో శ్రద్ధ తీసుకోండి. అందుకే మీపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్స్‌పోజింగ్ చేయటం ఆపండి. నిండైన దుస్తులు ధరించండి. మైనర్‌లకు సెల్‌ఫోన్లు ఎందుకో అర్థం కావటం లేదు. తల్లిదండ్రులు వారి నుంచి ఫోన్లను లాక్కోండి. నన్ను అడిగితే సెల్‌ఫోన్లు మొత్తానికే బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరతా. ఎందుకంటే ఫోన్ల ద్వారానే పోర్న్‌కు జనాలు అలవాటు పడిపోతున్నారు. ఆ ఉద్వేగంలో అత్యాచారాలకు పాల్పడుతున్నారు’ అని విద్యార్థి ప్రసంగించారు.
అశ్లీలత తగ్గాలంటే అమ్మాయిల పట్ల అబ్బాయిలకు గౌరవ భావం పెరగాలి. అంటే వారి బంధాలు పవిత్రంగా ఉండాలి. అందుకే వారి మధ్య అన్నచెల్లెల బంధం నెలకొనాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తర్వాత ఆయన మీడియాకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. కాగా, అత్యాచారాలపై గతంలోనూ మరికొందరు నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలయ్యారు.
ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌కు మద్ధతు ఇచ్చే కమ్రంలో మరో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలు పెరగిపోవటానికి తల్లిదండ్రలే కారణమని, పిల్లలను పట్టించుకోకపోవటం మూలంగానే ఇష్టమొచ్చినట్లు గాలికి తిరుగుతున్నారని సురేంద్ర వ్యాఖ్యానించారు. అమ్మాయిలను కాకుండా, పిల్లల తల్లులను ఎవరైనా రేప్ చేస్తారా? అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు.
గతేడాది కర్ణాటక హోం మంత్రిగా ఉన్న కేజీ జార్జి గ్యాంగ్ రేప్‌కు సరికొత్త భాష్యం చెప్పారు. ఇద్దరు కలిసి చేస్తే అది సామూహిక అత్యాచారం అవదని, కనీసం నలుగురైదుగురు చేస్తేనే అది గ్యాంగ్ రేప్ కిందకు వస్తుందంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఛండీగఢ్ లైంగిక వేధింపుల ఘటనపై స్పందించిన బీజేపీ డిప్యూటీ చీఫ్ రామ్‌వీర్ భట్టి.. అర్ధరాత్రిలో అమ్మాయిలకు రోడ్ల మీద ఏం పని? ఇంట్లో మూస్కోని కూర్చోకుండా.. అందుకే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు.