సీపీఐ ‘సర్వేజనా సుఖినో భవంతు’   | CPI is to release Manifesto today | Sakshi
Sakshi News home page

సీపీఐ ‘సర్వేజనా సుఖినో భవంతు’  

Nov 22 2018 2:15 AM | Updated on Nov 22 2018 2:15 AM

CPI is to release Manifesto today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూ చట్టాల్లో సమగ్ర మార్పులు, విద్యుత్‌ చార్జీలకు టెలిస్కోపిక్‌ విధానం రద్దు, మద్యం అమ్మకాల సమయం కుదింపు తదితర అంశాలతో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఈబీసీ, మైనార్టీ, అనాథల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు కేరళ తరహాలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌)లో మార్పులు తెచ్చి మినీ సూపర్‌ మార్కెట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రతిపాదించింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో అన్ని పక్షాలు కలసి ‘కామన్‌ ఎజెండా’రూపొందిస్తూనే భాగస్వామ్య పక్షాలు మాత్రం సొంతంగా ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. సీపీఐ రూపొందించిన మేనిఫెస్టోలో ధార్మికరంగంపైనా ప్రత్యేక దృష్టిని సారించింది. దీనిలో భాగంగా అన్ని మతాల ప్రార్థనాలయాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు, ఆలయాలు, ప్రార్థనా సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత, పెన్షన్ల చెల్లింపు వంటి వాటిని చేర్చింది. సీపీఐ సూచిస్తున్న ఆయా అంశాలను మహాకూటమి ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌’లేదా కామన్‌ ఎజెండాలో చేర్చాలని ఆ పార్టీ కోరనుంది. సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, డా.సుధాకర్‌లతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. ఈ మేనిఫెస్టోను సీపీఐ గురువారం విడుదల చేయనుంది.  

మేనిఫెస్టో ముఖ్యాంశాలు.. 
- ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి కట్టడికి చర్యలు 
పాతకాలపు రెవెన్యూ చట్టాల్లో సమూల మార్పులు 
వ్యవసాయరంగ పరిరక్షణ, రైతులు, కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు
అన్ని వర్గాలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు
మద్యం విక్రయ సమయాలు మరింత కుదింపు ∙పర్యావరణ పరిరక్షణ
పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ 
విద్యుత్‌ చార్జీల గణనకు ప్రస్తుతమున్న టెలిస్కోపిక్‌ విధానం రద్దు
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు, క్రీడాకారులు, న్యాయవాదుల సంక్షేమానికి చర్యలు
కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ
ప్రవాస తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు
మెట్రో రైలు చార్జీల తగ్గింపు  ట్రాన్స్‌జెండర్లు, బాలకార్మికుల హక్కుల పరిరక్షణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement